కోర్టు ఆదేశాలు బేఖాతర్!
ఎస్‌వీ పురంలో హైలీ
ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ గోడౌన్
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : క్వారీల్లో బండలు పేల్చడానికి వాడే ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ గోడౌన్‌ను నగరి మండలంలోని ఎస్‌వీ పురంలో నిర్మించారు. పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్ అండ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతులతో ఈ గోడౌన్ నిర్మిస్తున్నామని చెప్పడం దుమారం లేపుతోంది. గోడౌన్ నిర్మాణానికి గ్రామ స్తుల అనుమతి కోరుతూ గ్రామసభ నిర్వహించకపోవడం, ప్రజల అనుమతి పొందకుండా, పంచాయతీ రెజల్యూషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై స్థానికంగా పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా యి. గోడౌన్ నిర్మించే ప్రాంతం సంబంధిత రైతుకు తెలియకుండా వారికి చెందిన బావి భాగం భూమిలో ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ గోడౌన్ నిర్మాణం చేపట్టారు. దీంతో రైతు లు జి.సుగుణమ్మ, జి.పరమేశ్వర్ నాయు డు హైకోర్టును ఆశ్రయించారు. సర్వే నం.119/4లోని బావిని పూడ్చి నిర్మాణాలు చేపడుతున్నారని విన్నవించుకున్నారు. పెట్రోలియం అండ్ సేఫ్టీ ఎక్స్‌ప్లోజివ్స్ ఆర్గనైజేషన్ అనుమతులు పొందడానికి చూపిన సర్వే నంబర్లలోను, ప్రస్తుతం నిర్మా ణం చేపడుతున్న సర్వే నంబర్లలోను వ్యత్యాసం ఉందని, అవి తేలేవరకు నిర్మాణాలు ఆపాలని కేసు వేశారు. ఆ వ్యత్యాసాలు తేలేవరకు నిర్మాణాలు ఆపాలని హై కోర్టు ఆదేశించింది. అయితే స్థానిక అధి కార పార్టీ, అధికారుల అండతో హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లు గోడౌన్‌ను నిర్మించేశారు. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు కూతవేటు దూరంలో ఈ గోడౌన్ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
శరవేగంగా గోడౌన్ ఏర్పాటు
రహదారి, రైల్వే పనులు పూర్తయ్యేలోపు నగరి, విజయపురం మండలాల్లోని గ్రావెల్, స్టోన్ క్వారీలను చక చకా పేల్చేసి వేగంగా తమిళనాడుకు తరలించి కాసు లు కొట్టేయాలనే దురుద్దేశమే గోడౌన్ ఏర్పాటుకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. పేలుళ్లకు అమ్మోనియం నైట్రేట్ ఎక్కువా అవసరం కావడంతో అందుబాటులోనే గోడౌన్ కూడా ఏర్పాటుచేసుకున్నారని చెబుతున్నారు. అపాయకర గోడౌన్ నిర్మాణంలో రెవెన్యూ అధికారుల హస్తం ఉందని బహిరంగంగా విమర్శిస్తున్నారు.
ఆ బావి నీరే ఆధారం
సర్వే నం.119/4లోని భావిని పూడ్చివేసి ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ గోడౌన్ నిర్మించేశారు. మా కున్న ఒకటిన్న ఎకరా భూమికి ఆ బావి నీరే ఆధారం. ఈ విషయమై గ్రామంలో గ్రామ సభ కూడా నిర్వహించలేదు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే కొందరి వద్ద సంతకాలు తీసుకొని గోడౌన్‌ను నిర్మించారు. సర్వే నం.119/12లోని ప్రభుత్వ భూములను కూడా కాంట్రాక్టరు తన భూములుగా చూపారు. ఈ అంశాలపై హైకోర్టులో కేసు వేశాం. నిర్మాణాలు ఆపాలని హైకోర్టు ఆదేశించింది. అయినా లెక్క చేయలేదు. అధికార పార్టీ అండదండలతో దౌర్జన్యంగా గోడౌన్ నిర్మిస్తున్నారు. ఎవరినీ రానీయకుండా చెక్ పాయింట్ నిర్మాణం కూడా పూర్తిచేశారు. నిర్మాణాలు ఆపాలంటూ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులతో పాటు, ఉన్నతాధికారులను సంప్రదించినా ఫలితం లేదు.
– జి.సుగుణమ్మ, ఎస్‌వీపురం, నగరి మండలం
ఎలాంటి రెజల్యూషన్ ఇవ్వలేదు
జాతీయ రహదారి పనుల నిమిత్తం ఎక్స్‌ప్లోజివ్స్ మెటరీయల్ గోడౌన్ ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ కాంట్రాక్టర్లు నన్ను సంప్రదించినా గ్రామ భద్రత దృష్ట్యా నిరాకరించాను. ఎక్స్‌ప్లోజివ్స్ మెటరీయల్ గోడౌన్‌కు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ అంశంపై గ్రామ సభ కూడా పెట్టలేదు. – ఎస్.కౌసల్య, సర్పంచ్, తడుకుపేట


