సంక్షోభంలో ప్రజారోగ్యం | WHO warns in Health Workforce Levels and Trends 2026 report | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో ప్రజారోగ్యం

Oct 11 2026 4:40 AM | Updated on Oct 11 2026 4:40 AM

WHO warns in Health Workforce Levels and Trends 2026 report

2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా ఆరోగ్య సిబ్బంది కొరత 

హెల్త్‌ వర్క్‌ఫోర్స్‌ లెవెల్స్, ట్రెండ్స్‌–2026 నివేదికలో డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

రాష్ట్రంలో వైద్యుల కొరత అధిగమించేలా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుచేపట్టిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌

నాడు చేపట్టిన 10 ప్రభుత్వ కాలేజీలకు చంద్రబాబు సర్కార్‌ ఎసరు

ప్రైవేటుకు ఆ కళాశాలలు కట్టబెట్టడం కోసం ప్రారంభించకుండా కుట్రలు

కాలేజీలను అడ్డుకుని ప్రజారోగ్యాన్ని బలిపీఠమెక్కిస్తున్న దుస్థితి 

పేద విద్యార్థులకు దక్కకుండాపోతున్న ఎంబీబీఎస్, పీజీ సీట్లు

మూడేళ్లలో ఏకంగా 3,500 ఎంబీబీఎస్‌ సీట్లను నష్టపోయిన రాష్ట్రం

సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగం సంక్షోభంలో పడుతోంది. 2030 నాటికి 1.11 కోట్ల మంది వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తోంది. హెల్త్‌ వర్క్‌ఫోర్స్‌ లెవెల్స్, ట్రెండ్స్‌–2026 నివేదికను డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా ప్రచురించింది. భారత్‌ సహా 122 దేశాల వైద్యుల డేటాను విశ్లేషించింది. ఈ నేపథ్యంలో వైద్యుల్లో 25 శాతం మంది 55 ఏళ్లు, ఆ పైన వయసులో ఉన్నట్లు తెలిపింది. వీరంతా వచ్చే దశాబ్ద కాలంలో రిటైరైతే వైద్యుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇలా ప్రపంచానికే వైద్యుల కొరత గండం పొంచి ఉన్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించకుండా రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలిపీఠం ఎక్కిస్తున్నారు. 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువలో ఉచిత సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవల కల్పన, ఎక్కువమంది వైద్యులను తయారుచేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలను గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. వీటిలో 10 కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు అక్కడ తరగతులు ప్రారంభించకుండా చంద్రబాబు సర్కార్‌ కుట్రలు పన్నుతోంది. ఫలితంగా మన పేద విద్యార్థుల వైద్యవిద్య కల చెదిరిపోవడమే కాకుండా, రాష్ట్రానికి కొత్తగా వైద్యులు సమకూరే అవకాశాలు లేకుండాపోతున్నాయి. 

అనుమతులు వచ్చినా ప్రారంభించకుండా..
ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతీ 10 వేల జనాభాకు 45 మంది వైద్యులు, నర్సులు ఉండాలి. కానీ, మన దేశంలో వీరు ఈ అవసరాలకు తగ్గట్లుగా లేరు. దీన్ని అధిగమించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2014 నుంచి దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అయితే, 2014–19 మధ్య కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేయకుండా చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం తలపెట్టారు. 

ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ప్రభుత్వ వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేయడంతో పాటు, ప్రతీ జిల్లాలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒకేసారి 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం  చేపట్టడమే కాకుండా వందేళ్ల రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2023–24లో ఏకంగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా సార్వత్రిక ఎన్నికల నాటికే అన్ని చర్యలు తీసుకున్నారు. 

అయితే, ఆ ఏడాది అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కళాశాలలన్నీ ప్రైవేట్‌కు ఇచ్చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పులివెందుల వైద్య కళాశాలను ప్రారంభించడానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) అనుమతులిచ్చినా మాకు కళాశాల వద్దని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా లేఖ రాసి అనుమతులు రద్దుచేయించింది. ఇలా 2024–25లో నాలుగు, 2025–26లో ఆరు వైద్య కళాశాలలు చొప్పున 10 వైద్య కళాశాలలు ప్రారంభించకుండా చంద్రబాబు గాలికొదిలేశారు. 

తీవ్రంగా నష్టపోతున్న పేద విద్యార్థులు
ప్రైవేట్‌ మోజులో చంద్రబాబు కుట్రల కారణంగా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి విద్యార్థులు  పెద్దఎత్తున ఎంబీబీఎస్, పీజీ సీట్లను కోల్పోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో 700, 2025–26లో 1,750 చొప్పున రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్‌ సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలోనూ కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కాకపోవడంతో మరో వెయ్యి సీట్లను మన విద్యార్థులు కోల్పోతున్నారు. ఈ లెక్కన మూడేళ్లలో ఏకంగా 3,500 మంది విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. 

గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో రచించిన ప్రణాళిక ప్రకారం 10 వైద్య కళాశాలలు ప్రారంభమై ఉంటే.. మొదటి బ్యాచ్‌ విద్యార్థులందరూ 2030 నుంచి వైద్య పట్టభద్రులుగా బయటకు వచ్చేవారు. 2030లో 700 మంది, ఆ తర్వాతి ఏడాది నుంచి ఏటా 1,750 మంది వైద్య పట్టభద్రులు రాష్ట్రానికి సమకూరేవారు. అంతేకాక.. ప్రతీ కాలేజీలో 20 వరకూ పీజీ సీట్లు సమకూరి భవిష్యత్తులో ఏటా 200 మంది కొత్త స్పెషలిస్ట్‌ వైద్యులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement