సాలూరు రూరల్: సాటి గిరిజన మహిళ అని కూడా చూడకుండా ప్రతిపక్ష పార్టీ ముద్రవేసి ఉద్యోగంలో నుంచి తీసివేయించినా మంత్రి సంధ్యారాణికి మంట చల్లారలేదా? అంటే అవుననే సమాధానం గిరిజనం నుంచి వినిపిస్తోంది. బాధిత మహిళ తనను ఎక్కడ నిలదీ స్తుందోనన్న భయంతో పోలీసుల సాయంతో ఆమెను గృహ నిర్బంధం చేయించడం చర్చనీయాంశంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని అన్నంరాజువలస పంచా యతీ చెరుకుపల్లి గ్రామంలో నివాసముంటున్న గాదిపల్లి ప్రశాంతి ఇంటిని బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అకస్మాత్తుగా పోలీసులు చుట్టుముట్టారు. అంతేకాకుండా ఆమెను మీరు ఇంట్లోనే ఉండాలంటూ హుకుం జారీ చేశారు. ఈ విషయమై అసలు పోలీసులు ఎందుకు వచ్చారు? ఏంజరుగుతుందో తెలియని ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. అన్నంరాజువలస గ్రామంలో గిరిజన మత్స్యకారులకు మోపెడ్ల పంపిణీ కార్యక్రమానికి గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి బుధవారం హాజరయ్యారు. అయితే సమావేశంలో మంత్రిని ఎక్కడ ప్రశాంతి ప్రశ్నిస్తుందోననే అనుమానంతో ముందస్తుగా పోలీసులతో గృహ నిర్బంధం చేశారని స్పష్టమవుతోంది. దీనికి కారణం గతంలో కేజీబీవీలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ప్రశాంతిని కనీసం పీటీజీ మహిళ అని చూడకుండా మంత్రి సంధ్యారాణి ఉద్యోగంలోంచి తీసేయించారు. కారణం చిన్నదే అయినా కేవలం ఆమెకు గత ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సూచన మేరకు వచ్చిన ఉద్యోగం అన్న అక్కసుతో పూర్తిగా విధుల నుంచి తొలగించారు. దీంతో ఆమె మంత్రి, అ«ధికారుల చుట్టూ తిరిగినా కనికరించలేదు. దీంతో విసిగిపోయిన ఆమె ప్రస్తుతం పోటీ పరీక్షలకు చదువుకుంటోంది. ఇలాంటి సమయంలో అసలు గతం మరిచిపోయి తన పని తాను చేసుకుంటున్న ఆమెను అకస్మాత్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేసి మానసిక వేదనకు గురిచేశారని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ ఊరంతా వైఎస్సార్‌సీపీ అభిమానులే
అన్నం రాజువలస పంచాయతీ ప్రజలంతా వైఎస్సార్‌సీపీ అభిమానులే. నేను ఎంత చేసినా నాకు ఓటు వేయరని మంత్రి సంధ్యారాణి అన్నా రు. బుధవారం అన్నం రాజువలస గ్రామంలో గిరి జన మత్స్యకారులకు మోపెడ్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నంరాజువల గ్రామస్తులు పూర్తిగా వైఎస్సార్‌సీపీకి చెందిన వారన్నారు. రాజన్నదొర ఈ గ్రామానికి ఏంచేశారో చెప్పాలన్నారు. మీకు అన్ని విధాలా ఆదుకుంటామని కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
మానసికంగా కుంగిపోయాను
నేను ఎంఏ బీఈడీ చదివాను. 2019లో కేజీబీవీ ప్రిన్సిపాల్‌గా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో గజపతినగరంలో చేరాను. 2022వ సంవత్సరంలో కరాసువలస కేజీబీవీకి బదిలీపై వచ్చాను. 2025 ఏప్రిల్ 9న మంత్రి సంధ్యారాణి పాఠశాల పరిశీలనకు వచ్చినప్పుడు పిల్లలకు వండిన వంటలు మెనూ ప్రకారం లేవని తనతో పాటు నలుగురు వంట ఆయాలను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి పలుమార్లు మంత్రి సంధ్యారాణి వద్దకు వెళ్లి ఉద్యోగం తిరిగి ఇప్పించండని వేడుకున్నాం. మీరు వైఎస్సార్‌సీపీకి చెందిన వారని, ఉద్యోగం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గ్రీవెన్స్ సెల్‌లో పలుమార్లు ఆర్జీ పెట్టాను అయినా అధికారులు స్పందించలేదు. కేజీబీవీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. ఉద్యోగ బాధ్యతలో పడి పోటీ పరీక్షకు ప్రిపేర్ అవలేకపోయాను. ఇప్పుడు ఇంట్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ఇలా పోలీసులు అకస్మాత్తుగా వచ్చి ఇంటి ముందు కుర్చీ లు వేసుకుని కూర్చోవడంతో కొంత సమయం అర్థం కాలేదు. చివర కు మంత్రి సంధ్యారాణి నా ఉద్యో గం తీసేసిన విషయంలో ఎక్కడ నిలదీస్తానో అనే భయంతో పోలీసులను కాపలా ఉంచారని అర్థమైంది. సాటి గిరిజన మహిళ అని చూడకుండా నాపై కఠినంగా వ్యవహరించిన మంత్రి సంధ్యారాణి ఇంకా నన్ను వెంటాడుతుంటే భయమేస్తోంది.
– గాదిపల్లి ప్రశాంతి చెరుకుపల్లి గ్రామం అన్నంరాజువలస పంచాయతీ


