● 17 మందిపై కేసుల నమోదు
రాజాం/రాజాం సిటీ: రాజాం పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. బొబ్బిలి లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ రామారావుతో పాటు మరికొంతమంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చికెన్, మటన్, చేపల దుకాణాలతో పాటు పండ్ల దుకాణాల్లోని తూనిక యంత్రాలను తనిఖీచేశారు. తూకాల్లో భారీగా తేడాలున్నట్లు గుర్తించారు. 17 మంది వ్యాపారులపై కేసులు నమోదుచేయడంతో పాటు తప్పుడు తూనిక యంత్రాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రతి షాపు వద్ద తూనిక యంత్రాలపై ఆరాతీయాలన్నారు. తప్పుడు తూకాలు వేస్తే తమకు ఫిర్యాదుచేయాలని సూచించారు. ప్రతి తూనిక యంత్రంపై తమ శాఖ వేసిన సీల్ ఉండాలని స్పష్టం చేశారు.
మూగ జీవాలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
రామభద్రపురం: నోరు లేని మూగజీవాలను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జ్ఞానప్రసాద్ హెచ్చరించారు. ఈ మేరకు మండల కేంద్రంలో తన సిబ్బందితో కలిసి మంగళవారం ఆయన వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో పార్వతీపురంలో కొనుగోలు చేసిన పశువులను ఎటువంటి అనుమతులు లేకుండా బొలెరో వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తుండగా కొండకెంగువ గ్రామం జంక్షన్ వద్ద వ్యాన్‌ను పట్టుకుని 6 పశువులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్ మార్పిన లక్ష్మణను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేశారు.పశువుల రక్షణార్థం వాటిని గోశాలకు తరలించారు.
ఆటో ఢీకొని వ్యక్తి మృతి
బలిజిపేట: మండలంలోని శివరాంపురం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బి.అనిల్‌కుమార్(28) అనే వ్యక్తి విజయనగరంలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ప్రమాదం గురించి ఎస్సై రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినంకలాం నుంచి బలిజిపేటకు ద్విచక్రవాహనంపై వస్తున్న బి.అనిల్‌కుమార్‌ను బలిజిపేట నుంచి పణుకువలస వెళ్తున్న ఆటో శివరాంపురం గ్రామ సమీపంలో ఢీకొట్టడంతో అనిల్‌కుమార్ తలకు గాయమైంది. వెంటనే బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విజయనగరంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి వైద్యం చేయిస్తుండగా సోమవారం రాత్రి మృతిచెందాడు. ఆటోలో ఉన్న రామారావు అనే వ్యక్తికి గాయాలు కాగా చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
జియ్యమ్మవలస రూరల్: పాఠశాలకు వెళ్లి చదువుకోమని మందలించినందుకు ఓ గిరిజన విద్యార్థి మనస్తాపం చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మండలంలోని చినతోలుమండ గూడ గ్రామానికి చెందిన బిడ్డకి దినకర్ రావాడరామభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. దినకర్ పాఠశాలకు సరిగ్గా వెళ్లడం లేదని తల్లిదండ్రులు మంద లించడంతో మంగళవారం ఉదయం ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో తల్లిదండ్రులు చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా వైద్యులు వాసుదేవరావు, రాఘవేంద్రరావు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి 108 ద్వారా తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు చెప్పారు.


