బొబ్బిలి: పట్టణంలోని రైల్వేస్టేషన్ జంక్షన్‌లో ఉన్న టింబర్ డిపోవద్ద గల మురుగుకాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని తారకరామా కాలనీకి చెందిన సంకిలి లక్ష్మణరావు(38) కాలువ దాటుతుండగా అందులో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటికి తీసి లక్ష్మణరావుగా గుర్తించారు. మృతుడికి భార్య శ్రీదేవి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నారాయణ రావు తెలిపారు.


