● 8,200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
పార్వతీపురం రూరల్: జిల్లా సరిహద్దులో గల సారా బట్టీలపై అబ్కారీ శాఖ కొరడా ఝుళిపించింది. ’నవోదయం 2.0’లో భాగంగా ఏపీ, ఒడిశా ఎకై ్సజ్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా మంగళవారం అంతర్రాష్ట్ర దాడులు నిర్వహించారు. ఒడిశాలోని రాయగడ జిల్లా మొరం గ్రామ సమీపంలో సాగుతున్న సారా తయారీ కేంద్రాలను కనుగొని దాడి చేసి 8,200 లీటర్ల బెల్లం ఊటను, 200 లీటర్ల సారాను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. పార్వతీపురం అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో కురుపాం ఎకై ్సజ్, పాలకొండ బీఎంపీపీ, పార్వతీపురం ఈఎస్‌టీఎఫ్, విజయనగరం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో పాటు రాయగడ పోలీసులు పాల్గొన్నారు. సరిహద్దుల చాటున గుట్టుగా సాగుతున్న అక్రమ సారా ముడిసరుకును పక్కా సమాచారంతో నిర్వీర్యం చేశారు. సరిహద్దుల మాటున అక్రమంగా సారా తయారీకి, రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ ఏఈఎస్ సంతోష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.


