వినూత్నపేర్లు పెట్టి వడ్డింపు
ఎంత వైవిధ్యంగా ఉంటే.. అంత వ్యాపారం
నగరంలో నయా ట్రెండ్‌గా మారిన హోటళ్లు, రెస్టారెంట్ల పేర్లు
వింతవింత పేర్లుతో భోజన ప్రియులకు ఆకర్షణ వల
గతంలో పెద్దలు.. పేరంటాళ్లు.. దేవుళ్లు.. ఊర్లు.. కుటుంబ సభ్యుల పేర్లతో వ్యాపార సముదాయాలు కనిపించేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. అన్నివర్గాలను ఆకర్షించేలా వ్యాపార కేంద్రాలకు సరికొత్త పేర్లు పెడుతున్నారు. చర్చనీయాంశమైన పేర్లుతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇడ్లీ బళ్లు.. ఇలా ఒకటేమిటి... ఆహార సముదాయాలన్నీ కొత్తకొత్త పేర్లతో కనిపిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
సాక్షిప్రతినిధి విజయనగరం: ప్రస్తుత సాంకేతిక యుగంలో రొటీన్..రెగ్యులర్ పేర్లు పెడితే జనానికి నచ్చడం లేదు. చిత్రమైన పేర్లు పెడితేనే వస్తున్నారు. పేరుచూసి మరీ వచ్చి కొనేస్తున్నారు. అందులో రుచి.. నాణ్యత.. పరిశుభ్రత ఎలా ఉందన్నది అనవసరం. ముందైతే పేరు బాగుండాలి.. రుచి సంగతి తరువాత చూద్దాం. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. దీనిని వ్యాపారులు అందుకుంటున్నారు. కొత్తకొత్తగా ఆలోచిస్తూ పేరులోనే గమ్మత్తు చూపిస్తున్నారు. వ్యాపారాలను వృద్ధిచేసుకుంటున్నారు.
ఎంత వైవిధ్యంగా ఉంటే.. అంత వ్యాపారం
ఒకప్పుడు పేర్లు పెట్టే విషయంలో అంత పట్టింపు ఉండేది కాదు. దేవుడి పేర్లు, వ్యక్తుల పేర్లే ఎక్కువగా పెట్టేవారు. వంటకాల రుచిపైనే ప్రధానంగా శ్రద్ధ ఉండేది. ఇప్పుడు ఆ సరసన చిత్రవిచిత్ర పేర్లు పెట్టడం చేరింది. ఇదే వ్యాపార సూత్రంగానూ మారింది. హోటల్ పేరు ఎంత వినూత్నంగా ఉంటే అంత బాగా వ్యాపారం జరుగుతుందని నిర్వాహకులు నమ్ముతున్నారు. కొన్నిచోట్ల వంటకాలకు ఇదే శైలిని అనుసరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉండేవారు.. ఆయాపేర్లున్న హోటళ్లకు పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేస్తున్నారు. తమ వ్యాఖ్యానాలతో అదనపు క్రేజ్ కల్పిస్తున్నారు.
ప్రాంతాల పేర్లను జోడిస్తూ..
అరిటాకు భోజనం, వివాహ భోజనం, అలనాటి రుచులు, తిన్నంత భోజనం, బాబాయ్ భోజనం, తాలింపు.. ఇలా మరికొందరు సంప్రదాయబద్ధంగా పేర్లు పెడుతున్నారు. దానికి తగ్గట్టుగానే అదే పద్ధతిలో వడ్డిస్తున్నారు. ఇంకొందరు ఆయా ప్రాంతాల్ని ప్రతిబింబించేలా రాయలసీమ రుచులు, ఆంధ్రా భోజనం, కోనసీమ రుచులు, నెల్లూరు చేపల పులుసు, గుంటూరు గోంగూర, కోనసీమ వంటిల్లు వంటి పేర్లతోనూ హోటళ్లు నిర్వహిస్తున్నారు.
చిత్ర విచిత్రంగా..
విజయనగరంలోని ఓ కూడలిలో ఒక స్నాక్స్ .. ఫాస్ట్‌ఫుడ్ బండి ఉంది.. అది సాధారణమైనదే.. కానీ దాని పేరే చిత్రం... ‘తిందాం రా మామ’ అనే పేరుతో ఉన్న ఆ బండి వద్ద సాయంత్రం అయ్యేసరికి జనం క్యూ కడుతున్నారు.. ఇడ్లీ అంటే రొటీన్ అయింది. చిట్టి ఇడ్లీ అంటూ అమ్మేస్తున్నారు. అలాగే, బంగార్రాజు బిర్యానీ... మా పల్లె దోశ.. కోనసీమ టిఫిన్స్.. చిక్‌పెట్ దొన్నె బిర్యానీ హౌస్.. కాకినాడ వారి చిట్టుబాబు కోడి పలావ్.. హౌస్ ఆఫ్ బిర్యానీ.. బిర్యానీస్ మోర్.. చికెన్ క్లౌడ్ వంటి పేర్లతో నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న ఆహార దుకాణాలు వెలిశాయి. సగటు వ్యక్తిని ఆకర్షించేలా నిర్వాహకులు తమ భోజనశాలలకు ఇలాంటి గమ్మత్తయిన పేర్లు ఎంచుకుంటున్నారు.
సాంకేతికతను జోడించుకుని...
మరికొంత మంది సాంకేతికతను ఉపయోగించి చిన్నపాటి ట్రైయిన్‌లపై, టేబుళ్లపై రైల్వే ట్రాక్‌లు మాదిరి ఏర్పాటు చేసి ఫ్లాట్ ఫాం నంబర్–65 పేరిట కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ ఆకర్షిస్తుండగా.. కొన్ని హోటళ్లలో రోబోలతో ఫుడ్‌సర్వ్ చేసి భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు. వింతవింతగా కనిపించే పేర్లు, వడ్డించే ప్రక్రియను ఆకస్తిగా స్వీకరిస్తున్న వినియోగదారులు ఆయా రెస్టారెంట్‌లలో తినేందుకు ఆసక్తి కనబరుస్తుండడం విశేషం.


