
ఢిల్లీ: బాబా చైతన్యానంద సరస్వతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద.. పోలీసులను తప్పించుకునేందుకు 50 రోజులు పరారీలో ఉండగా.. ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగ్రాలోని ఓ హోటల్‌లో బస చేసిన అతడిని ఆదివారం(సెప్టెంబర్ 28) తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. 50 రోజుల పాటు సీసీటీవీలకు చిక్కకుండా పరారీలో ఉన్న ఢిల్లీ బాబా గురించి షాకింగ్ విషయాలు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మధుర తదితర ప్రాంతాల్లో తిరిగారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన 50 రోజుల్లో 15 హోటళ్లను మార్చాడు. సీసీటీవీ కెమెరాలు లేని చౌక హోటళ్లలోనే అతను బస చేసేవాడని పోలీసులు తెలిపారు. బాబాకు సహకరించిన ఆయన సహాయకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, బాబా చైతన్యానంద సరస్వతి నుంచి పోలీసులు ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్‌లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని తెలిపారు.
చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్ కమిషన్ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్‌లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు.
ఢిల్లీలోని మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు గతంలో చైర్మన్‌గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్‌కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్‌లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్‌డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్‌మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్ పాస్‌వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.