
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విశాఖపట్నం–సికింద్రాబాద్ (20833) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో సాంకేతిక సమస్య తలెత్తడంతో విజయవాడ స్టేషన్‌లో మూడున్నర గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరాల్సిన ఈ రైలు దాని జత రైలు అలస్యం కారణంగా ఇప్పటికే 5 గంటలు అలస్యంగా బయలుదేరేలా అధికారులు రీషెడ్యూల్ చేశారు. దీంతో విశాఖలో ఈ రైలు 10.43 గంటలకు బయలు దేరింది.
బయలుదేరిన కొంత సమయానికే రైలులోని నాలుగు బోగీలలో ఏసీలు పనిచేయడం ఆగిపోయాయి. అసలే వేసవి ఉక్కపోత దీనికి తోడు రైలులో తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేసి ఉండడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై కొంత మంది ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రాజమండ్రి స్టేషన్‌లో కొంతమంది టెక్నిషియన్‌లను రైలులో పంపారు.
అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ చేరుకోవడంతో ఏడీఆర్‌ఎం శ్రీకాంత్ పర్యవేక్షణలో సిబ్బంది సుమారు మూడున్నర గంటలు శ్రమించి మరమ్మతులు పూర్తిచేశారు. అనంతరం 5.30 గంటలకు రైలు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లింది. అసలే 5 గంటల ఆలస్యం అందులో మరోమూడున్నర గంటలు మరమ్మతుల కోసం నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
విశాఖ మార్గంలో పలు రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్ అనకాపల్లి–తాడి సెక్షన్ మధ్యలో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రద్దు చేసిన రైళ్లు: ఈ నెల 17న గుంటూరు–విశాఖపట్నం (17239), విశాఖపట్నం–విజయవాడ (22701/22702), మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైళ్ల రద్దు, 18న విశాఖపట్నం–గుంటూరు(17240), విశాఖ పట్నం–మచిలీపట్నం (17220) రైళ్లను రద్దు చేశారు.