కలెక్టర్‌కు వినతిపత్రమిస్తున్న కాసు మహేష్ రెడ్డి
పల్నాడులో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్
గ్రామస్తులు ఆందోళన చేసినా తీరు మార్చుకోని అధికారులు
ఓట్లు నమోదు చెయ్యొద్దని నేరుగా బీఎల్‌ఓలకు ఆదేశం
పిడుగురాళ్ల/నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ‘సర్’ కార్యక్రమం అపహాస్యం పాలవుతోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ తంతు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను నమోదుచేసేందుకు బీఎల్‌ఓలు సైతం ముందుకురాకపోవడంతో స్థానిక ఓటర్లు ఆందోళన వ్యక్తంచేశారు. సర్ ప్రక్రియకు ఇక సోమవారం ఒక్కరోజే గడువు మిగిలి ఉండడంతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను నమోదుచేసేందుకు బీఎల్‌ఓలు నానుస్తున్నారు. దీంతో కరాలపాడు ఓటర్లు, బీఎల్‌ఏలు అందరు కలిసి పిడుగురాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు.
గ్రామ ఇన్‌చార్జి ఆర్‌ఐ శ్రీనిబాబు, ఐదుగురు బీఎల్‌ఓలు గ్రామానికి వచ్చి విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారులు మా గ్రామానికి వస్తేనే ఇక్కడ నుంచి కదులుతామని తేల్చిచెప్పడంతో గత్యంతరంలేక ఆర్‌ఐ శ్రీనిబాబుతోపాటు బీఎల్‌ఓలు కరాలపాడు గ్రామానికి స్థానికుల వెంట వెళ్లారు. అయినప్పటికీ టీడీపీ సానుభూతిపరులవి మాత్రమే నమోదుచేస్తుండడంతో అధికారులపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
కలెక్టర్‌కు కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు..
ఈ నేపథ్యంలో.. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు ఫిర్యాదు చేశారు. దీంతో కోనంకి, కరాలపాడు గ్రామంలో పూర్తిస్థాయిలో సర్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ మధుబాబులను ఆదేశించారు. ఈలోగా పోలీసులు కరాలపాడు సచివాలయం వద్దకు చేరుకుని టీడీపీ సానుభూతిపరులవి మాత్రమే బీఎల్‌ఓ ద్వారా దగ్గరుండి ఆన్‌లైన్ చేయిస్తున్నారు. తమను సచివాలయంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు ఆరోపించారు.
అలాగే, కోనంకి గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను ఆన్‌లైన్ చెయ్యొద్దని తహసీల్దార్ బీఎల్‌ఓలకు ఆన్‌లైన్ లాగిన్ ఇవ్వలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు నమోదుచేయాలన్న లక్ష్యంతో సర్ ప్రక్రియ నిర్వహిస్తుంటే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను ఆన్‌లైన్‌లో నమోదుచేయకుండా ఉన్నతాధికారులే అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ మధుబాబును వివరణ కొరేందుకు ప్రయతి్నంచినా ఆయన అందుబాటులోకి రాలేదు.
మూడ్రోజుల ముందే ఆపేశారు: కాసు
మరోవైపు.. నరసరావుపేటలో కలెక్టర్‌ను కలిసిన అనంతరం కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఈనెల 14 సాయంత్రం వరకు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని డిజిటలైజ్ చేయాల్సి ఉన్నా మూడ్రోజుల ముందే కరాలపాడు, కోనంకి గ్రామాల్లోని బీఎల్‌ఓలు, ఎన్నికల అధికారులు ఓటర్ల దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోవడం నిలిపివేశారని చెప్పారు. దీన్ని తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు.


