ఉచితమంటూ.. ముసుగు దోపిడీ | Sakshi
Sakshi News home page

ముసుగు దోపిడీ

Published Fri, Nov 3 2023 5:07 AM

TDP Leader Chandrababu looted In Sand Illegally - Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు మహిళా సంఘాల ముసుగులో అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి ఖజానాకు కన్నం వేశారు. ఒకే ఇసుక బిల్లుపై అక్రమంగా తరలించిన వేలాది టన్నులను అధిక ధరలకు విక్రయించి దోచుకున్నారు. మహిళ సంఘాల పేరుతో ఇసుక దందాపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో 2016 మార్చి 4న అప్పటి సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానం పేరుతో దోపిడీకి టీడీపీ నేతలకు రాచబాట వేశారు.

అప్పటివరకు ఇసుక సరఫరా కోసం బుకింగ్‌ చేసుకుని డబ్బులు కట్టిన వారికి రూ.47.50 కోట్లను వెనక్కి చెల్లించలేదు. ఆ డబ్బులకు లెక్కలు చెప్పలేక గత ప్రభుత్వం నీళ్లు నమిలిందని 2018లో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక పేర్కొంది. తద్వారా టీడీపీ నేతల ఇసుక దోపిడీని ఎండగట్టింది. 

ఎల్లో గ్యాంగ్‌ కనుసన్నల్లో రీచ్‌లు
మహిళా సాధికారత పేరుతో రాష్ట్రంలో ఇసుక రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలను స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అప్పగిస్తూ 2014లో గత సర్కారు ఇసుక విధానాన్ని ప్రకటించింది. ఇసుక విక్రయాల కోసం రాష్ట్ర స్థాయిలో సెర్ప్‌ (పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్‌ శాండ్‌ మైనింగ్‌ ఫెసిలిటీ ఏజెన్సీస్‌(డీఎస్‌ఎంఎఫ్‌ఏ)లను ఏర్పాటు చేశారు. వాటి పర్యవేక్షణలో ఇసుక అమ్మకాలకు పోర్టల్‌ ఏర్పాటైంది.

ఇసుక కోసం పోర్టల్‌లో బుక్‌ చేసుకుని ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే మహిళా సంఘాలు ఇసుకను సరఫరా చేసేలా రూపొందించిన విధానం కాగితాలకే పరిమితమైంది. మహిళా సంఘాల ముసుగులో టీడీపీ నేతలు ఇసుక రీచ్‌లను తమ అధీనంలోకి తీసుకున్నారు. పోర్టల్‌లో ఇసుక కోసం బుక్‌ చేసుకున్న ఒకే బిల్లుపై వేలాది టన్నులు అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో 2016 మార్చి 4న దాన్ని రద్దు చేసి ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు.

అప్పటివరకు ఇసుక కోసం పోర్టల్‌లో బుక్‌ చేసుకుని సరఫరా చేయని వారికి డబ్బులు రీఫండ్‌ చేస్తామని పేర్కొంది. ఇందుకోసం 2016–17లో సెర్ప్‌ రూ.35.52 కోట్లను విడుదల చేయగా రూ.13.57 కోట్లను రీఫండ్‌ చేశారు. అంటే మిగతా డబ్బులు మిగుల్చుకున్నట్లు స్పష్టమవుతోంది. 2017 ఫిబ్రవరిలో ఇసుక బుకింగ్‌ చేసుకున్న వారికి రీఫండ్‌ చేసేందుకు మరో రూ.25.55 కోట్లను సెర్ప్‌ విడుదల చేసింది.

వాస్తవానికి రీఫండ్‌ కోసం అప్పటికే విడుదల చేసిన నిధులు మిగిలి ఉండగా మళ్లీ డబ్బులు విడుదల చేయడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. రీఫండ్‌కి సంబంధించి రూ.47.5 కోట్లకు లెక్కలు చెప్పాలని అడిగితే గత సర్కారు నీళ్లు నమిలిందని కాగ్‌ స్పష్టం చేసింది. దీన్ని బట్టి టీడీపీ నేతలే ఇసుక బుక్‌ చేసుకుని ఒకే బిల్లుపై వేలాది టన్నులు అక్రమంగా తరలించి డబ్బులు కాజేసినట్లు స్పష్టమవుతోంది.   

Advertisement
Advertisement