ఎకరం రూ.4 కోట్లు పలికే భూమి రూ.10 లక్షలకే
జగ్గయ్యపేట వద్ద జయంతిపురంలో మేఘా గ్రూప్ కంపెనీకి సర్కారు కేటాయింపు
రాజధానికి చేరువలో రూ.కోట్లు పలికే భూమి కారుచౌకగా అప్పగింత
నాయుడుపేటలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి అత్యంత చేరువలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద జయంతిపురంలో రూ.కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని మేఘా గ్రూపునకు కారుచౌకగా కట్టబెడుతూ చంద్రబాబు సర్కారు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) గ్రూపునకు చెందిన ఐకామ్ టెలీ లిమిటెడ్ రూ.895 కోట్లతో నెలకొల్పే రక్షణ రంగ ఉత్పత్తుల యూనిట్‌కు చౌకగా భూములతో పాటు కీలక మౌలిక వసతులను కల్పించనుంది.
సీఆర్‌డీఏ పరిధిలో ఉండే ఈ భూములను ఎకరం రూ.10 లక్షలు చొప్పున 300 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.నాలుగు కోట్ల పైనే పలుకుతోంది. సుమారు రూ.1,200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.30 కోట్లకే కట్టబెట్టడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. ఆ స్థలానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా రహదారి మార్గం కల్పించడంతోపాటు జగ్గయ్యపేట మున్సిపల్ వాటర్ స్కీం నుంచి 425 కేఎల్‌డీ నీటి సరఫరా, 4.25 ఎంవీఏ సామర్థ్యంతో విద్యుత్ సరఫరా సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చనుంది.
ఇక ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా దత్తులూరు వద్ద మిసైల్ తయారీ, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు 300 ఎకరాలు కేటాయిస్తూ మరో ఉత్తర్వు జారీ అయింది. విజయనగరంలో పతంజలి గ్రూపు ఏర్పాటు చేస్తున్న హెర్బల్ పార్కుకు ఎకరం రూ.3 లక్షల చొప్పున 70 ఎకరాలు కేటాయిస్తూ మరో ఉత్తర్వు వెలువడింది. తొలి దశ పూర్తయితే మరో 100 ఎకరాలు ఇస్తారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారానికీ ప్రోత్సాహకాలు!
మరోవైపు ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గృహ సముదాయాన్ని 6.11 ఎకరాల్లో ఏర్పాటుచేయనుంది.
ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.95 కోట్లతో మౌలిక వసతులు కల్పించనుంది. అలాగే బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సరళ ఏవియేషన్‌కు అనంతపురం జిల్లా తిమ్మసముద్రం వద్ద 150 ఎకరాలు, నెల్లూరు దత్తులూరు వద్ద ఆండ్రోన్ సిస్టమ్స్‌కు 349.95 ఎకరాలు, అనంతపురం తిమ్మసముద్రం వద్ద స్పేస్‌ఫీల్డ్ సంస్థకు 120.76 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.


