టీటీడీ ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్.. సాంకేతిక లోపాలపై భక్తుల అసంతృప్తి | TTD Online Ticket Booking System Faces Criticism As Devotees Report Technical Issues And Failed Attempts For Darshan Slots | Sakshi
Sakshi News home page

టీటీడీ ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్.. సాంకేతిక లోపాలపై భక్తుల అసంతృప్తి

Jun 25 2026 9:22 PM | Updated on Jun 26 2026 1:47 PM

Severe difficulties in booking Tirumala online tickets

సాక్షి,తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎదురుచూసే సామాన్య భక్తులకు ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ ఒక పెద్ద ప్రహసనంగా మారింది. టీటీడీ అధికారిక పోర్టల్ ద్వారా ప్రతి నెల విడుదలయ్యే వివిధ రకాల దర్శన కోటాలు, ఆర్జిత సేవా టిక్కెట్ల బుకింగ్ సమయంలో ఎదురవుతున్న సాంకేతిక లోపాలపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఓ  శ్రీవారి భక్తుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆన్‌లైన్ టికెట్లు విడుదలయ్యే సమయానికి ముందే వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి, కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నామని వాపోయారు. స్లాట్లు ఓపెన్ అయిన మరుక్షణమే ‘వర్చువల్ క్యూ’లోకి పంపుతున్నారని, అక్కడ నిమిషాల తరబడి నిలబడి మొబైల్ నంబర్ ఓటీపీలు ఎంటర్ చేసి, భక్తుల వివరాలు నమోదు చేసే లోపే పరిస్థితి మారిపోతోందని ఆవేదన చెందుతున్నారు.

చివరకు పేమెంట్ ఆప్షన్‌కు వెళ్లేసరికి ‘స్లాట్ ఆల్రెడీ బుక్డ్’ అనే సందేహం మాత్రమే స్క్రీన్‌పై దర్శనమిస్తోందని భక్తులు వాపోతున్నారు. సామాన్యుడికి అందని ద్రాక్షేనా?ఈ టికెట్ల కేటాయింపు ప్రక్రియపై భక్తులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ ఆన్‌లైన్ టికెట్లు సామాన్య భక్తులకు నిజంగానే దొరుకుతున్నాయా? లేక కేవలం హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నవారికి, వ్యవస్థ వేగాన్ని అందుకోగల సాంకేతిక నిపుణులకు మాత్రమే లభిస్తున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.

భక్తి, అదృష్టం, ఇంటర్నెట్ స్పీడ్ ఈ మూడింటిలో ఏది ఉంటే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో భక్తులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా కోటా విడుదలైన 20 నుండి 30 నిమిషాల్లోనే లక్షలాది టికెట్లు మాయమవ్వడం వెనుక కారణాలను విశ్లేషించాలని, సాధారణ భక్తుడి సమయానికి, శ్రమకు కనీస విలువ ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

దళారుల ప్రమేయం లేకుండా, అందరికీ సమానమైన, పారదర్శకమైన రీతిలో దర్శన అవకాశాలు కల్పించే నూతన విధానాన్ని టీటీడీ ఎందుకు ప్రవేశపెట్టడం లేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. స్వామివారి సన్నిధికి రావాలని కోరుకునే ప్రతి భక్తుడికి న్యాయం జరిగేలా గోవిందా అని పిలిచే భక్తుల బాధ ఆలయ బోర్డు అధికారుల వరకు వినబడేలా టీటీడీ తక్షణమే స్పందించి ఈ ఆన్‌లైన్ సర్వర్ సమస్యలను, బుకింగ్ లోపాలను సరిదిద్దాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement