
కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నవ వరుడు, అతడి బావ మృతి
కారుపై పడిన మరో కారు
డివైడర్‌ను ఢీకొని, ఎగిరి మరో కారుపై బోల్తా
హనుమాన్‌జంక్షన్ రూరల్/గన్నవరం రూరల్: చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నవ వరుడు, అతడి బావ మృతి చెందగా, ముగ్గురు చిన్నారులుసహా ఆరుగురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన ఇరువురిలో ఒకరికి గత నెల 30వ తేదీన వివాహమయ్యింది. కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, వీరవల్లి వద్ద శనివారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, హనుమాన్‌జంక్షన్‌కు చెందిన మూడెడ్ల స్వామి వెంకట ధీరజ్ (37) సీఏ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు.
అతడి చిన్న బావ చీరా నవీన్ (35) కెనరా బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత నెల 30న ధీరజ్‌కు వివాహమైంది. ధీరజ్ భార్య రూప (32)తో కలిసి శనివారం సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. వీరితో పాటుగా ధీరజ్ అక్క అలేఖ్య, మరో సోదరి ప్రవల్లిక, ఆమె భర్త చీరా నవీన్‌తో పాటు ముగ్గురు చిన్నారులు కూడా విజయవాడకు కారులో పయనమయ్యారు.
ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి..
మార్గం మధ్యలో వీరవల్లి వద్ద ఎదురుగా అవతలి వైపు రోడ్డులో వేగంగా వస్తున్న కారు ఒకటి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని, ఎగిరి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. అప్పటి వరకూ కారులో సరదాగా మాటలు చెప్పుకుంటూ వెళుతున్న వీరంతా తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. అంబులెన్స్, ట్రక్కు ఆటోలో క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన చిన్నవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ ఆస్పత్రికి తరలించారు.
ధీరజ్, నవీన్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ధీరజ్ భార్య రూప అపస్మారక స్థితిలో ఉంది. మృతుడు నవీన్‌కు కూడా రెండేళ్ల క్రితమే ప్రవల్లికతో వివాహం కావడం గమనార్హం. అలేఖ్య, ఆమె మూడేళ్ల కుమార్తె హంస్విక (4), కుమారుడు తనుష్ సాయి (2), ప్రవల్లిక, ఆమె రెండేళ్ల కుమార్తె ఎస్.జాని్వక గాయత్రి (1) కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
ఎదుటి కారు డ్రైవర్ నిర్లక్ష్యం
ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్, వీడియోగ్రాఫర్ కోసూరు శ్రీనివాసరావు తీవ్ర నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఘటనను బట్టి స్పష్టమవుతోంది. విజయవాడకు చెందిన అతడు హనుమాన్‌జంక్షన్‌లో ఒక శుభకార్యానికి వీడియోగ్రఫీ పని నిమిత్తం వస్తున్నాడు. శ్రీనివాసరావు కూడా గాయాలపాలై ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మానవత్వం చాటుకున్న వైద్యుడు
రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను గుర్తించిన డాక్టర్ బి.కిషోర్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఈ మార్గంలో కారులో వెళుతున్న హైదరాబాద్ ఎమ్మోర్ హస్పటల్స్ ఎండీ డాక్టర్ బి.కిషోర్‌రెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించి హుటాహుటిన కిందకు దిగారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు.