లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 18న రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను శుక్రవారం ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరిశీలించారు. లబ్బీపేటలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా, కదిరి ఇన్‌చార్జి మక్బుల్‌లతో కలిసి దేవినేని అవినాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ముస్లిం మైనార్టీలు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వారి వెంట మైనారిటీ నేత మీర్‌హుస్సేన్ కూడా ఉన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శనీయమని.. అపారమైన జ్ఞానంతో రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రచించి, సామాన్యులకు కూడా సాహిత్య రుచిని చూపించారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి మొల్లమాంబ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్‌టీచింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు శుక్రవారం ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్‌టీచింగ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో పనిచేస్తున్న నాన్–టీచింగ్ ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం, సేవా సంబంధిత అంశాలపై సంయుక్త సంచాలకులను కలిసి వివరించామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, కళాశాలల పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి సంఘం సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నాన్‌టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్. విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానం, ఉచిత ప్రసాద వితరణకు పలువురు భక్తులు శుక్రవారం విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఎం. దశరథ రామారావు, ఇందిర అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ. 2,01,116 అందించారు. చీరాల వైకుంఠపురానికి చెందిన వైబీవీ నాయుడు కుటుంబం ఉచిత ప్రసాద వితరణ పథకానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.


