
స్పౌజ్, మ్యూచువల్‌కు మాత్రమే అవకాశం
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు జీవిత భాగస్వామి (స్పౌజ్), పరస్పర (మ్యూచువల్) అంతర్ జిల్లా బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ స్కూళ్లల్లో పనిచేస్తూ ఈ ఏడాది జూలై 31 నాటికి రెండేళ్ల సర్వీసు ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించారు.
దరఖాస్తుదారులు ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, బదిలీ కోరుకుంటున్న జిల్లా వివరాలకు సంబంధించి రెండు రకాల ఫార్మాట్లలో గురువారం నుంచి ఈ నెల 24లోగా ఉపాధ్యాయులు లీప్ యాప్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. దరఖాస్తుల ప్రింట్ కాపీలను స్థానిక ఎంఈవోలకు అందించాలని, వీటిపై డీఈవో పరిశీలన చేసి ఈనెల 27 నాటికి డైరెక్టరేట్‌కు పంపించాలన్నారు.
మ్యూచువల్, స్పౌజ్ కేటగిరీ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తాజా బదిలీల్లో మెడికల్ గ్రౌండ్స్ కింద అవకాశం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వ్యక్తిగతం, మెడికల్ గ్రౌండ్స్ కింద కూడా అంతర్ జిల్లా బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అలాగే, మిగులు ఉపాధ్యాయులకు సైతం అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు.