సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సిట్ హైకోర్టును ఆశ్రయించడంతో కస్టడీ విచారణకు బ్రేక్ పడింది. సీఐ నాగరాజు కస్టడీ విచారణ షరతులపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత సీఐని సిట్ కస్టడీకి తీసుకోనుంది. తదుపరి విచారణ ఎల్లుండికి హైకోర్టు వాయిదా వేసింది. నాగరాజు అరెస్టు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారించడం వరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తనను సిట్ ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే న్యాయమూర్తికి సీఐ నాగరాజు చెప్పిన సంగతి తెలిసిందే.
కాగా, సిట్ కస్టడీ వేళ.. ఈ కేసు నిందితుడు, సీఐ(సస్పెండెడ్) నాగరాజు కోర్టుకు రాసిన లేఖ బయటకు వచ్చింది. అందులో తాను నిర్దోషినని పేర్కొంటూ.. ప్రత్యేక దర్యాప్తు బృందంపై సంచలన ఆరోపణలకు దిగాడు. సాయికృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని నాగరాజు విజయవాడ కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అయితే.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. అంతేకాదు తనను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి.. నేరం ఒప్పించాలని చూస్తోందని, అందుకే కస్టడీకి కోరిందని అంటున్నాడు.
సాయికృష్ణ కేసులో తనను సిట్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం అసలే లేదని.. కేవలం కేసులో ఇరికించేందుకే సిట్ ఈ డ్రామా ఆడుతోందని ఆరోపించాడు. ఒకవేళ.. తనను విచారించాల్సి వస్తే న్యాయవాదుల సమక్షంలోనే అది జరిగేలా చూడాలని కోర్టును కోరాడు. అదేవిధంగా, తనపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి (టార్చర్) జరగకుండా కోర్టు జోక్యం చేసుకోవాలన్నాడు.


