సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసు మిస్టరీ అధికారికంగా వీడింది. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, అది కస్టడీయల్ డెత్ కేసుగా పేర్కొంటూ దర్యాప్తు బృందం కోర్టుకు నివేదిక సమర్పించింది. అలాగే ఈ కేసులో అరెస్టయిన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బుధవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (2nd AJM) కోర్టులో ఈ కేసు నిందితుడు సీఐ(సస్పెండెడ్) నాగరాజును హాజరుపరిచిన సిట్ అధికారులు.. దర్యాప్తులో వెలుగుచూసిన పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కోర్టుకు సిట్ చెప్పిన షాకింగ్ నిజాలు
- సాయికృష్ణను తీసుకెళ్లి మాయం చేశారు
- సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశాం
- మొత్తం 17 మంది సాక్షులను విచారించాం
- మే 6న సాయికృష్ణను మార్కాపురంలో అరెస్ట్ చేశారు
- అదే తేదీన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీఐ నాగరాజుకు అప్పగించారు
- నాగరాజు 24 గంటల్లోపు సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టలేదు
- నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉన్నా కూడా కోర్టులో ప్రవేశపెట్టలేదు
- సాయికృష్ణను నాగరాజు కస్టడీలో ఉండగా పీఎస్‌లో చూసినట్లు ఓ ఎస్సై వాంగ్మూలం ఇచ్చాడు
- మృతదేహాన్ని కూడా చూసినట్లు తర్వాత అదే ఎస్సై స్టేట్‌మెంట్ ఇచ్చాడు
- సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాక.. డెడ్‌బాడీని మాయం చేశారు
- కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీఫుటేజీ లేదు
- మే 1 నుంచి జూన్ 1 దాకా ఫుటేజీలు లేవు
- వాటిని ఎవరు? ఎందుకు మాయం ఎందుకు చేశారనేది తేలాల్సి ఉంది
- అయితే మే 6-8 తేదీల మధ్య.. ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ డెలివరీ బాయ్ సాయికృష్ణను చూసినట్లు చెప్పాడు
- ఇతర సాక్ష్యాలను పరిశీలించాకే.. కస్టోడియల్ డెత్‌గా నిర్ధారించుకున్నాం
- ఈ కేసులో నిందితుడైన నాగరాజును అరెస్ట్ చేశాం
- ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదు
- అక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణం.. డెడ్‌బాడీ మాయం చేశారు
- హైకోర్టులో నిజాలు దాచి అత్యంత తీవ్రమైన నేరం చేశారు
- ఆధారాలు మాయం కావడం సహా అన్నింటికీ నాగరాజే కారణమని భావిస్తున్నాం
సిట్ తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది ప్రకారం.. మార్కాపురంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాదె సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) ఉన్నప్పటికీ, చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచలేదని తెలిపారు. ఇది కోర్టు ధిక్కరణ (Contempt of Court) కిందకు వస్తుందని పేర్కొన్నారు.

అలాగే దర్యాప్తులో సాయికృష్ణ పోలీసుల అదుపులో ఉండగానే మృతి చెందినట్లు ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు వెల్లడించారు. మృతి విషయాన్ని మెజిస్ట్రేట్‌కు తెలియపర్చకుండా.. మృతదేహాం మాయం చేశారని తెలిపారు. అయితే సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారన్న ఆరోపణలకు ఆధారాలేమిటని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. నాగరాజు నుంచి కీలక ప్రశ్నలకు సమాధానం దొరకలేదని సిట్ కోర్టుకు తెలిపింది.
సాయికృష్ణను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు?
లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ డెడ్‌బాడీని ఏం చేశారు?
పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీని ఎందుకు మాయం చేశారు?
ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందన సిట్ కోర్టుకు తెలిపింది. అందుకే మరింత దర్యాప్తు అవసరమని పేర్కొంది.
నాగరాజుకు రిమాండ్
రిమాండ్ రిపోర్ట్ నేపథ్యంలో.. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు నిందితుడు నాగరాజుకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది కోర్టు. జులై 8న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టమని సిట్‌ను ఆదేశించింది. దీంతో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇదిలా ఉండగా, తన కుమారుడు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి ఇప్పటికే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ, సిట్ దర్యాప్తు, తాజాగా కోర్టులో వెల్లడైన అంశాలు కేసును మరింత కీలక దశకు తీసుకెళ్లాయి. సీఐ(సస్పెండెడ్) నాగరాజు రిమాండ్ రిపోర్టులో నమోదైన అంశాలు, సిట్ కోర్టుకు సమర్పించిన వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


