ఇంటి పంటగా కుంకుమ పువ్వు | Sakshi
Sakshi News home page

ఇంటి పంటగా కుంకుమ పువ్వు

Published Sun, Jan 14 2024 3:56 AM

Saffron as a house crop - Sakshi

సాక్షి, అమరావతి: కుంకుమ పువ్వు అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. ఇరిడాసే కుటుంబానికి చెందిన ఈ పూలను శీతల ప్రదేశాల్లోనే సాగు చేస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఇరాన్‌లో సాగవుతుండగా.. మన దేశంలో కశ్మీర్‌లో మాత్రమే సాగవుతోంది. రాష్ట్రానికి చెందిన కొందరు ఔత్సాహికులు కశ్మీర్‌ కుంకుమ పూలను సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి, పల్నాడు జిల్లా కారంపూడి మండలాల్లో పలువురు ఇంటి (ఇండోర్‌) పంటగాను, ఏరోఫోనిక్స్, ఐదంచెల విధానాల్లో దీనిని సాగు చేస్తున్నారు.  

కశ్మీర్‌ నుంచి విత్తనాలు తెచ్చి.. 
కశ్మీర్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కుంకుమ పూల విత్తనాలతో రెండేళ్ల క్రితం కుంకుమ పూ­ల సాగుకు రాష్ట్రంలో బీజం పడింది. వీటి సాగు కోసం 220 నుంచి 250 చదరపు అడుగుల విస్తీ­ర్ణం గల భవనంలో ప్రత్యేకంగా ర్యాక్స్‌ ఏర్పా­టు చేసి వాటిలో 300 నుంచి 350 ట్రేలను ఏ­ర్పా­టు చేస్తున్నారు. తీసుకొచ్చిన సీడ్స్‌ను గ్రేడింగ్‌ చేసి ఐదంచెలలో మట్టిలోను, ఏరోఫోని­క్స్‌ పద్ధతిలో మట్టి లేకుండా సాగు చేపట్టారు.

కనిష్టంగా 10నుంచి 12 డిగ్రీలు, గరిష్టంగా 28­నుంచి 30 డిగ్రీలకు మించకుండా ఉష్ణోగ్రతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిల్లర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. జూలైలో విత్తుకోగా.. అక్టోబర్‌–నవంబర్‌ నెలల్లో కుంకుమ పూలు కోతకొస్తాయి. కోత పూర్తయిన తర్వాత ఏరోఫోనిక్స్‌ చేసుకున్న సీడ్స్‌ను మట్టిలోకి మా­ర్చుకుంటే చాలు విత్తన పునరుత్పత్తి ప్రారంభమవుతుంది. మట్టిలోనే సీడ్‌ విస్తరించి రెండు పొ­రలుగా విడిపోయి కొత్త సీడ్‌ తయారవుతుంది.  

ఖర్చు ఇలా.. 
విత్తనం క్వాలిటీని బట్టి కిలో రూ.600 నుంచి రూ.650 వరకు ఖర్చవుతుంది. రవాణాకు మరో రూ.100 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. సుమారు 350 కిలోల విత్తనాలకు రవాణాతో కలిపి రూ.2 లక్షలు, 250 చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనంలో ర్యాక్స్, ట్రేలకు రూ.1.50 లక్షలు, 2 టన్నుల ఏసీ చిల్లర్‌కు రూ.1.75 లక్షలు, హ్యూమిడిఫెయిర్‌కు రూ.45 వేలు, ఉష్ణోగ్రతను స్థిరీకరించేందుకు మరో రూ.45 వేలు, లైట్నింగ్‌ కోసం రూ.35 వేలు కలిపి మొత్తంగా సుమారు రూ.7 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని అంచనా. అక్టోబర్‌ నుంచి నవంబర్‌ వరకు పూచే  పూలలో మూడు అండకోశాలు, రెండు కేశరాలు ఉంటాయి.

కింద భాగంలో పసుపు, పైన ఎరువు రంగులో ఉండే ఈ అండ కోశాలనే కుంకుమ పువ్వుగా పిలుస్తారు. ఎరువు రంగులో ఉండే అండకోశ భాగా­లను తుంచి ఎండబెడతారు. పూలను కోయడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. కుంకుమ పూలు గ్రాముకు రూ.600 నుంచి రూ.800 వరకు ధర పలుకుతుంది. మగ పువ్వు గ్రాముకు రూ.40–రూ.60 చొప్పున ధర లభిస్తుంది. కాస్త పబ్లిసిటీ చేస్తే చాలు మార్కెటింగ్‌కు ఢోకా ఉండదు.

ఆదాయం బాగుంది 
అగ్రికల్చర్‌లో ఎంఎస్సీ చేశాను. ఏదైనా స్టార్టప్‌ ప్రారంభించాలన్న సంకల్పంతో 2022లో కుంకుమ పూల సాగు చేపట్టా.  కశ్మీర్‌ నుంచి విత్తనాలు తీసుకొచ్చి 250 చ.అ. విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం. రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. పర్పల్స్‌్రస్పింగ్స్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నాం. వాట్సప్‌ ద్వారా కూడా ఆర్డర్స్‌ తీసుకుని  సరఫరా చేస్తున్నాం. ఆదాయం బాగుంది.    – పి.శ్రీనిధి, మదనపల్లి, చిత్తూరు జిల్లా 

తొలి ఏడాది రూ.లక్ష ఆదాయం వచ్చింది 
కశ్మీర్‌ నుంచి విత్తనాలు తెచ్చి 220 చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనంలో కుంకుమ పూల సాగు చేపట్టా. 100 గ్రాములు పూలు వచ్చాయి. మరో 100 గ్రాముల మేల్‌ ఫ్లవర్స్‌ కూడా వచ్చాయి. యూట్యూబ్‌ చానల్‌ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నాం. గ్రాము రూ.800 చొప్పున అమ్మాను. మేల్‌ గ్రాము రూ.40, రూ.50 చొప్పున అమ్మాను. రూ.లక్ష వరకు ఆదాయం వచ్చింది. వచ్చే ఏడాది ఉత్పత్తి రెట్టింపు అవుతుంది.   – కారంపూడి లోకేశ్, రొంపిచర్ల, పల్నాడు జిల్లా

Advertisement

తప్పక చదవండి

Advertisement