ప్రైవేట్ ఉపాధ్యాయురాలితో సాన్నిహిత్యం
నిలదీసినందుకు భర్తకే బెదిరింపులు
పిల్లలతో కలిసి స్టేషన్ మెట్లు ఎక్కిన భర్త
గురజాల సబ్ డివిజన్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఘటన
నరసరావుపేట టౌన్: సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన కానిస్టేబుల్ దారితప్పారు. తన భార్యతో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకొని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అతని నుంచి రక్షణ కల్పించాలని భర్త తమ పిల్లలతో కలిసి ఫిర్యాదు చేశారు. అధికారులు అందుబాటులో లేరని ఫిర్యాదు ఇచ్చేందుకు మరో రోజు రావాలని సిబ్బంది వెనక్కు పంపారు. పల్నాడు జిల్లా గురజాల సబ్ డివిజన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి.
పల్నాడు జిల్లాలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ తాను నివాసం ఉండే సమీపంలో ఉంటున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలితో గత కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. విషయం భర్తకు తెలిసి కానిస్టేబుల్‌ను నిలదీయడంతో అతనిపై బెదిరింపులకు దిగారు. దీంతో భర్త తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని శనివారం ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లారు. పిడుగురాళ్లలో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణ కార్యక్రమం విధుల నిమిత్తం అధికారులు వెళ్లడంతో స్టేషన్‌లో అందుబాటులో లేరు.
అధికారులను కలిసి ఫిర్యాదు చేసేందుకు భర్త గంటలకొద్దీ వేచి ఉన్నా రాలేదు. మరో రోజు రావాలని సిబ్బంది ఫిర్యాదు స్వీకరించకుండా వెనక్కు పంపారు. దీర్ఘకాలంగా ఒకే స్టేషన్‌లో పనిచేస్తూ స్టేషన్‌లో రికార్డు వర్క్ చేస్తున్న ఆ కానిస్టేబుల్‌పై గతంలో కూడా అనేక అవినీతి ఫిర్యాదులు ఉన్నాయి. అయితే అధికారులకు నెలవారీ మామూళ్లు వసూళ్లు చేయటంలో సదరు కానిస్టేబుల్ కీలక పాత్ర పోషిస్తుండటంతో అధికారులు అతని అక్రమాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుల్ ఆగడాలపై పల్నాడు జిల్లా ఎస్పీని సోమవారం కలిసేందుకు బాధితుడు సిద్ధమైనట్లు సమాచారం.


