ఓటుహక్కు పౌరసత్వానికి అత్యంత ప్రాణప్రదం
కోట్లాది మందిని ఓటు హక్కుకు దూరం చేయడం రాజ్యాంగ విరుద్ధం
నోటీసు ఇవ్వకుండా తొలగించరాదు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్
సాక్షి, హైదరాబాద్: భారతీయ పౌరుడి ఓటుహక్కు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో అంతర్భాగమని, కోట్లాది మంది ఓట్లను దూరం చేసే ఏ ప్రక్రియ అయినా పూర్తిగా ఏకపక్షమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేశారు. అటువంటి చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), 326 (వయోజన ఓటు హక్కు)లను స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 19వ నల్సార్–జస్టిస్ బీఆర్ సాహ్ని మెమోరియల్ మూట్ కోర్టు పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
భారత రాజ్యాంగం పౌరులను ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలుగా విభజించడాన్ని అంగీకరించదని జస్టిస్ భూయాన్ అన్నారు. ‘ఏదైనా ఒక ప్రక్రియ కారణంగా దేశంలోని కోట్లాది మంది పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయి, సొంత దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోతే, అలాంటి ప్రక్రియ సహజంగానే అత్యంత ఏకపక్షమైనది. ఎలాంటి సాకులు లేదా ఏ ఇతర వాదనలు దీన్ని సమర్థించలేవు. ఇది రాజ్యాంగ మూలాలనే దెబ్బతీస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
ఓటు హక్కు,.. పౌరసత్వానికి అసలైన ప్రాణం
‘నిజానికి, ఓటు హక్కు అనేది పౌరసత్వానికి అసలైన ప్రాణం. దేశ పాలనా వ్యవస్థలో ఒక సామాన్య పౌరుడు భాగస్వామి కావడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. ఆర్టికల్ 326ను ఎవరూ మార్చలేరు. ఏ అధికార సంస్థ కూడా ఇలా చేయలేదు. ఏ కోర్టు కూడా దీన్ని క్షమించదు. రాజ్యాంగానికి అతీతులు ఎవరూ లేరు’ అని జస్టిస్ భూయాన్ స్పష్టం చేశారు. గతంలో కొన్ని తీర్పుల్లో ఓటు హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికీ, ’పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు తీర్పు ప్రకారం ఓటు హక్కు కచ్చితంగా రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అది ఆర్టికల్ 326 ద్వారానే లభిస్తుందని జస్టిస్ భూయాన్ స్పష్టం చేశారు.
పరిపాలనాపరమైన ప్రక్రియల ద్వారా పౌరుల ఓటు హక్కును హేతుబద్ధత లేకుండా హరించకూడదన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 ప్రకారం ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించే ముందు సదరు ఓటరుకు తగిన వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలన్నారు. ‘ఓటరు మరణించిన సందర్భంలో తప్ప, ఒకసారి ఓటర్ల జాబితాలో చేరిన పేరును సదరు వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా, వారి వివరణ వినకుండా తొలగించడానికి వీల్లేదు. ఒక భారతీయ పౌరుడి గుర్తింపు నుంచి ఓటు హక్కును లేదా ఓటర్ల జాబితాలో ఉండే హక్కును వేరు చేయలేం. అది శరీరం నుండి ఆత్మను తీసేయడంతో సమానం’ అని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యానించారు.
స్వాగతించిన కాంగ్రెస్, తృణమూల్
జస్టిస్ భూయాన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్వాగతించారు. ‘పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం గళమెత్తే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ఇప్పుడు ఓటు హక్కు అనేది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగమని అత్యంత ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా సీఈసీ స్వయంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఇది నిరూపిస్తోంది’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
జస్టిస్ భుయాన్ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వైఫల్యాలను పూర్తిగా ఎండగట్టారని, జ్ఞానేశ్‌కు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు ఎంతమాత్రం లేదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సైతం జస్టిస్ భూయాన్‌ను అభినందించారు. ‘పదవీ విరమణ చేసిన రోజున న్యాయమూర్తులు ధైర్యంగా మాట్లాడటం చాలా సులువు. కానీ, పదవిలో ఉన్న ఒక సిట్టింగ్ జడ్జి అధికార పీఠాన్ని ప్రశ్నిస్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఇదే మొదటిసారి. జస్టిస్ భూయాన్‌కు నా అభినందనలు’ అని ఆమె పేర్కొన్నారు.


