
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రరెడ్డి(కుంచాల సౌందరరెడ్డి) అక్రమ అరెస్టును ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ బుధవారం తాడేపల్లి పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం పోలీసుల తీరును తీవ్రంగా ఆక్షేపించింది.
సవీందర్రెడ్డి(Savindra Reddy) కేసులో తాడేపల్లి పోలీసులు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆయన్ని అరెస్టు చేసిన సమయంపై రిమాండ్ రిపోర్టులో తప్పుడు సమాచారం పొందుపర్చారు. సాయంత్రం 7గం. సమయంలో అదుపులోకి తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. అయితే..
అయితే ఆయనను సాయంత్రం 4.30గంటలకే అరెస్టు చేసినట్లు సవీంద్ర రెడ్డి తరఫు లాయర్ సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించారు. దీంతో పోలీసులు చెబుతున్న విషయంపై అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు(AP High Court).. ఆ వీడియోపై ప్రశ్నలు గుప్పించింది. ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయిని.. పేర్కొంటూ సీసీటీవీ ఫుటేజీతో పాటు ఎక్కడ, ఎప్పుడు అరెస్ట్ చేశారో పూర్తి దర్యాఫ్తు చేసి నివేదిక ఇవ్వాలని మంగళగిరి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం లోపు ఈ వివరాలను తెలియజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలంటూ ఆదేశించింది.
అదే సమయంలో.. సవీంద ర్రెడ్డిని అరెస్టు చేసిన విధానంపైనా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా.. అరెస్ట్ చేయడానికి యూనిఫారమ్‌లో ఎందుకు వెళ్లలేదని ఎస్‌హెచ్‌వోను ప్రశ్నించింది. సవీందర్రెడ్డి భార్య కంప్లైంట్ చేసినా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ఆ కంప్లైంట్‌ను కేవలం జీడీ ఎంట్రీ మాత్రమే చేయడం ఏంటని నిలదీసింది. ఈ క్రమంలో..
సవీంద ర్రెడ్డిని ఏం జరిగిందో చెప్పాలని న్యాయమూర్తులు అడిగారు. తన భార్యతో ఉండగా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారని, గంజాయి గురించి ఏమీ తెలియదని ఆ సమయంలో సవీంద్ర కన్నీరు పెట్టుకున్నారు.
ఓ పౌరుడిని పోలీసులు చాలా క్యాజువల్‌గా వచ్చి పట్టుకుపోయి తిప్పుతూ ఉంటే.. మేం చూస్తూ ఊరుకోవాలా? ఇంత చేస్తున్నా కూడా మేం జోక్యం చేసుకోకూడదా? తన భర్త సౌందరరెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని అతడి భార్య ఫిర్యాదు ఇస్తే జనరల్ డైరీ (జీడీ)లో ఎంట్రీ చేసి మౌనంగా ఉండిపోతారా? ఓ మహిళ ఫిర్యాదు ఇస్తే దానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరా? మీరు ఇంత చేస్తుంటే.. మమ్మల్ని చూస్తూ మౌనంగా ఉండమంటారా..?
– తాడేపల్లి పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ఇదీ చదవండి: సవీంద్ర అక్రమ అరెస్ట్.. తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యత్నం!