పౌరులను పట్టుకెళుతున్నా చూస్తూ ఊరుకోవాలా? | AP High Court Fires On Police Department | Sakshi
Sakshi News home page

పౌరులను పట్టుకెళుతున్నా చూస్తూ ఊరుకోవాలా?

Sep 24 2025 5:38 AM | Updated on Sep 24 2025 5:38 AM

AP High Court Fires On Police Department

పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఓ పౌరుడిని పోలీసులు చాలా క్యాజువల్‌గా వచ్చి పట్టుకుపోయి తిప్పుతూ ఉంటే.. మేం చూస్తూ ఊరుకోవాలా? ఇంత చేస్తున్నా కూడా మేం జోక్యం చేసుకోకూడదా? తన భర్త సౌందరరెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని అతడి భార్య ఫిర్యాదు ఇస్తే జనరల్‌ డైరీ (జీడీ)లో ఎంట్రీ చేసి మౌనంగా ఉండిపోతారా? ఓ మహిళ ఫిర్యాదు ఇస్తే దానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరా? మీరు ఇంత చేస్తుంటే.. మమ్మల్ని చూస్తూ మౌనంగా ఉండమంటారా..?
– ఖాకీల తీరుపై హైకోర్టు కన్నెర్ర

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై పోలీసుల అరాచకాలు ఆగడం లేదు. హైకోర్టు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయడం లేదు. తీరు మార్చుకోవడం లేదు. అబద్ధాలతో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా ఇలాగే కోర్టుకు అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డి అలియాస్‌ సవీంద్రరెడ్డిని అక్రమంగా నిర్బంధించిన పోలీసులు అసలు ఆయన ఎక్కడున్నాడో తమకు తెలియనే తెలియదంటూ బుకాయించి హైకోర్టును తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. 

అయితే ఖాకీల తీరు గురించి బాగా తెలిసిన హైకోర్టు వెంటనే అప్రమత్తమైంది. సౌందరరెడ్డి ఎక్కడున్నా సరే గాలించి బుధవారం తమ ముందు హాజరుపరచాల్సిందేనని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులను ఆదేశించింది. ఆయన్ను మరో కేసులో అరెస్ట్‌ చేశామంటూ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడానికి కూడా వీల్లేదని హెచ్చరించింది. సౌందరరెడ్డిని నేరుగా తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. 

ఒకవేళ సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైతే.. అతడిని తమ ముందే హాజరుపరిచి తీరాలన్న తమ ఉత్తర్వుల గురించి సంబంధిత పోలీసులకు, మేజిస్ట్రేట్‌కు స్పష్టంగా చెప్పి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజకు తేల్చి చెప్పింది. సోషల్‌ మీడియా యాక్టివిస్టు సౌందరరెడ్డిని ఒంగోలు పోలీసు ట్రైనింగ్‌ అకాడమీ (పీటీఏ)లో అక్రమంగా నిర్బంధించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెబుతున్న నేపథ్యంలో,  పీటీఏ డైరెక్టర్‌ను ఈ వ్యాజ్యంలో సుమోటో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్‌ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అక్రమ నిర్బంధంపై లంచ్‌మోషన్‌ పిటిషన్‌..
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, అరగంటలో ఇంటికి పంపేస్తామంటూ తీసుకెళ్లారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న మంగళవారం అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది.

ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు..
పిటిషనర్‌ తరఫున న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఇంటికి వెళుతున్న సౌందరరెడ్డిని తాడేపల్లి పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఏ కేసులో తీసుకెళుతున్నారు..? ఎక్కడికి తీసుకెళుతున్నారు..? లాంటి వివరాలు ఏమీ చెప్పలేదన్నారు. ఆయన జాడ ఇప్పటివరకు తెలియడం లేదన్నారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. బాధితుడు ఒంగోలు పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఉన్నట్లు తెలిసిందని రామలక్ష్మణరెడ్డి చెప్పారు. దీనిపై ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్నారు.

లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. 
దీనిపై హైకోర్టు ధర్మాసనం పోలీసుల తరఫున హాజరవుతున్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజను వివరణ కోరగా.. సౌందరరెడ్డిని ఏ పోలీసు అధికారీ తాడేపల్లి స్టేషన్‌కు తీసుకురా­లేదని చెప్పారు. అసలు సౌందరరెడ్డి ఎక్కడున్నాడో తమకు తెలియదన్నారు. ఆయన్ను ఏ పోలీసూ అదుపులోకి తీసుకోలేదన్నారు. తన భర్తను కొందరు తీసుకెళ్లారంటూ పిటిషనర్‌ లక్ష్మీప్రసన్న ఫిర్యాదు చేశారని, దానిని తాము జనరల్‌ డైరీలో నమోదు చేశామని కోర్టుకు నివేదించారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుని చెబుతానన్నారు. 

అయితే పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన హైకోర్టు.. అసలు ఓ మహిళ ఫిర్యాదు చేస్తే దానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా కేవలం జనరల్‌ డైరీలో మాత్రమే నమోదు చేయడం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నా కూడా ఆచూకీ తెలుసుకుని బుధవారం తమ ముందు హాజరుపరిచి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. 

రిమాండ్‌ రిపోర్ట్‌ సైతం సిద్ధం చేసి..
వాస్తవానికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు సౌందరరెడ్డిని సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలలోపు మేజి­స్ట్రేట్‌ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమ­య్యారు. ఆ మేరకు రిమాండ్‌ రిపోర్ట్‌ సైతం సిద్ధం చేశారు. అయితే ఈ విషయాలన్నీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తెలిసినప్పటికీ ఆయన కోర్టుకు వాస్తవాలు వెల్లడించలేదు. అసలు సౌందరరెడ్డి తమ అధీనంలోనే లేరంటూ చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటలలోపు సౌందరరెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైన పోలీసులు.. అనంతరం అసలు ఆయన తమ అధీనంలోనే లేరని సాయంత్రం 4 గంటల సమయంలో హైకోర్టుకు చెప్పడం గమనార్హం.

తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యత్నం...!
పరిస్థితి చేయిదాటి పోతుండటంతో పోలీ­సుల తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ­ప్రత్యేక న్యాయవాది ప్రయత్నించారు. సౌందరరెడ్డిని ఏ పోలీసూ అదుపులోకి తీసుకో­లేదని తొలుత చెప్పిన ఆయన తరువాత మాట మార్చారు. ఒకవేళ ఏదైనా ఇతర  కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి ఉంటే..! అంటూ కప్పదాటు వైఖరి అనుస­రించారు. అప్పటికే ధర్మాసనానికి మొత్తం వ్యవ­­హారం అర్థం కావడంతో.. సౌందర­రెడ్డిని ఏ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుప­రచడా­నికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఏ కేసులో­నైనా సరే.. సౌందరరెడ్డిని తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాలని ధర్మా­సనం పోలీసు­ల­కు అల్టిమేటం జారీ చేసింది. ఈ విషయంలో మరో మాటకు తావు లేదంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement