‘అమరావతి–ఆవకాయ’ ఈవెంట్ కోసం రూ.5 కోట్లు వ్యయం
పర్యాటకాభివృద్ధి సంస్థలో ఉద్యోగుల వెతలను మాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కారు
ఐఆర్ ఎరియర్స్ విడుదల చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం
ఏపీటీడీసీ ఖాతా నుంచి రూ.1.20 కోట్లు కూడా చెల్లించలేని దుస్థితి
డెప్యూటేషన్‌పై పనిచేస్తున్న అధికారుల నిర్వాకంతో సొంతగూటి ఉద్యోగులకు తీవ్రనష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉద్యోగుల బకాయిలు చెల్లించడంలో ఒకవైపు తీవ్ర తాత్సారం చేస్తూ.. మరోవైపు వేడుకల పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. గత ప్రభుత్వంలో నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్‌తో బలవంతంగా రాజీనామా చేయించడమే కాకుండా ఇప్పటివరకు కొత్త చైర్మన్‌ను నియమించకుండా, పీఆర్సీ అమలును అడ్డుకుని, కనీసం ఐఆర్‌ను ప్రకటించకుండా నిలువునా ముంచేస్తోంది. ఇక్కడ ప్రభుత్వోద్యోగుల వెతలు ఒక ఎత్తయితే.. కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టాలు మరో ఎత్తు.
ఇటీవల పర్యాటక శాఖలో ‘ఆవకాయ–అమరావతి’ పేరుతో ఒక సినిమా, సాహిత్య ఈవెంట్‌కు ఏకంగా రూ.5 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అదే పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉద్యోగులకు గత ఐఆర్ ఎరియర్స్ విడుదల చేయడానికి మాత్రం డబ్బుల్లేవని చేతులెత్తేస్తోంది. వాస్తవానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీటీడీసీ ఆధ్వరంలో నడిచే హరిత హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఒడిగట్టింది. ఇలా ఒక్కొక్కటిగా ఏపీటీడీసీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వచ్చింది.
ఈ క్రమంలోనే సంస్థకు చెందిన శాశ్వత ఉద్యోగులను బదిలీల పేరుతో ప్రధాన కార్యాలయం నుంచి బయటకు పంపించి తమ మాట వినే అధికారులకు డెప్యూటేషన్లపై పగ్గాలు అప్పగించింది. ఫలితంగా ఏడాదిన్నర కాలంలో ఏపీటీడీసీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవల్సి వచ్చింది.
రూ.1.20 కోట్లు కూడా లేవా?
ఏపీటీడీసీలో పనిచేస్తున్న 55 మంది ఇన్ సర్వీస్ ఉద్యోగులకు రూ.1.20 కోట్లు, 35 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రూ.70 లక్షల వరకు ఐఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మేలో ఏపీటీడీసీ ఎండీ నిధుల విడుదలకు ఆర్డర్ ఇచ్చారు. అయితే, ఇన్‌సర్వీస్ ఉద్యోగులకు మూడు దఫాల్లో ఇస్తామని మెలికపెట్టారు. ఇందులో ఇప్పటివరకు కేవలం ఒక దఫా మాత్రమే చెల్లించారు. మిగిలిన రెండు దఫాలు గురించి అడిగిన ఉద్యోగులకు సంస్థలో డబ్బుల్లేవనే మాట తప్ప మరో సమాధానం రావట్లేదు.
విచిత్రం ఏమిటంటే.. రిటైరైన ఉద్యోగులకు మాత్రం సింగిల్ సెటిల్‌మెంట్‌లో మొత్తం చెల్లించేశారు. దీని వెనుక ఏపీటీడీసీలో డెప్యూటేషన్‌పై పనిచేస్తున్న అధికారులు భారీఎత్తున ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇన్ సర్వీస్ ఉద్యోగులను ప్రధాన కార్యాలయంలోకి రానిస్తే తమ ఆటలు సాగవనే వారికి దక్కాల్సిన చెల్లింపులను అడ్డుకుంటున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదేమి న్యాయం మేడం..
ఏపీటీడీసీలో డెప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఓ కీలక అధికారిణికి ఏడాదిన్నరగా పొడిగింపు ఆర్డర్ లేదు. కానీ, ఆమె ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతినెలా జీతం తీసుకుంటూనే ఉన్నారు. ఏపీటీడీసీకి చెందిన శాశ్వత ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు విడుదల చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సదరు అధికారి ఒక్కరే కాదు.. కీలక విభాగాలు అన్నింటిలోనూ డెప్యూటేషన్ ఉద్యోగులే చక్రం తిప్పుతున్నారు.
ఇక ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క కొత్తబోటు కొనలేదు.. హోటళ్ల ఆదాయాన్నీ పెంచలేదు.. పైగా ఉత్సవాల పేరుతో ఏపీటీడీసీ ఆదాయాన్ని అప్పనంగా వాడేస్తున్న పరిస్థితి. కానీ, అక్కడి ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా డబ్బుల్లేవంటూ ఇబ్బందులకు గురిచేస్తోంది. వాస్తవానికి.. అక్టోబరు నుంచి జనవరి వరకు ఏపీటీడీసీకి పీక్ సీజన్. ఈ సమయంలో పర్యాటకుల ద్వారా సంస్థకు అధిక రాబడి వస్తుంది. కానీ, డెప్యూటేషన్ అధికారులు మాత్రం ఖజానాలో చిల్లిగవ్వ లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో 27 శాతం ఐఆర్..
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఏడాది జూలైలో ఉద్యోగులకు పీఆర్సీ కంటే ముందు 27 శాతం ఐఆర్ అమలుచేసింది. అయితే, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీనిని వర్తింపజేసే క్రమంలో కరోనా విజృంభించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత 2021 నవంబరులో ఏపీటీడీసీ బోర్డు ప్రభుత్వం ఇచ్చిన ఐఆర్ జీఓతో సొంత నిధులు వాడుకుని ఉద్యోగులకు వర్తింపజేసేలా ఆమో దం తెలిపింది. దీనిపై 2021 డిసెంబరులోనే ప్రభుత్వం జీఓ జారీచేసింది.
ఇంతలో 2022 జనవరి నుంచి ప్రభుత్వం పీఆర్సీ అమలులోకి తీసుకురావడం.. ఆ వెంటనే దానిని ఏపీటీడీసీ బోర్డు సైతం ఆమోదించి అమలుచేసింది. అయితే, ఆ తర్వాత ఏపీటీడీసీ రెవెన్యూ వృద్ధి చెందగా 2024లో బకాయిలు తీర్చే క్రమంలో ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఏపీటీడీసీ ఉద్యోగులు పోరాడుతూనే ఉన్నా ప్రభుత్వం కనికరించట్లేదు.


