వాగ్గేయకారుడు అన్నమయ్య గౌరవానికి చరమగీతం!
చరిత్రలో తొలిసారి ఒక జిల్లా రద్దు దిశగా అడుగులు
ఒక విధానం, హేతుబద్ధత లేకుండానే అన్నమయ్య జిల్లా రద్దు!
తొలుత మూడు నియోజకవర్గాలతో జిల్లాగా కొనసాగించాలని యోచన
చివరికి ఆ మూడింటిని మదనపల్లె, కడప, తిరుపతి జిల్లాల్లో కలిపేందుకు యత్నాలు
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ చిన్నాభిన్నమే పునర్విభజన లక్ష్యం
బాపట్ల జిల్లా ప్రాధాన్యాన్ని తగ్గించి కొత్తగా మార్కాపురం జిల్లా
అరకు పార్లమెంటు విచిత్రంగా విభజన.. పోలవరం లేకుండానే పోలవరం జిల్లా
కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో ఆ జిల్లా ఏర్పాటు
రాజంపేట, అరకు, ఒంగోలు ప్రాంతాల్లో రాజకీయ లబ్ధే ధ్యేయం
జిల్లాల స్వరూపాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్న చంద్రబాబు
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఏర్పడిన జిల్లాలకు తూట్లు
అసలు ఒక విధానమే లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పునర్విభజన
సాక్షి, అమరావతి: స్వార్థ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జిల్లాల పునర్విభజన చేస్తున్నారు. ప్రజల, పాలనా సౌలభ్యాలకు తిలోదకాలిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక శాస్త్రీయ ప్రాతిపదికన ఏర్పాటైన జిల్లాలను టీడీపీ ప్రయోజనాలే పరమావధిగా అస్తవ్యస్తంగా మారుస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక జిల్లా రద్దుకు సిద్ధమయ్యారు. 2023లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన రాజంపేట పార్లమెంటు ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు.
ఆ జిల్లాకు అదే ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత వాగ్గేయకారుడు అన్నమయ్య గౌరవార్థం పేరు పెట్టారు. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటైంది. దీనికి అందరి ఆమోదం లభించింది. ఇప్పుడు దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కకావికలం చేస్తోంది. అప్పట్లో చిత్తూరు జిల్లా ప్రాధాన్యాన్ని కొనసాగించేందుకు రాజంపేట పరిధిలో ఉన్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలిపారు.
చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేసే పేరుతో అన్నమయ్య జిల్లా రూపురేఖలను మార్చివేసేలా ప్రతిపాదించారు. ఆ జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న మదనపల్లె జిల్లాలో కలిపారు. చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు అసెంబ్లీ స్థానాన్ని మదనపల్లె జిల్లాలో విలీనం చేశారు.
తుది నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి మిగిలిన రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలను తిరుపతి, కడప, మదనపల్లె జిల్లాల్లో కలపి అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు. అదే గనుక జరిగితే అన్నమయ్య జిల్లా కనుమరుగైనట్లే.
తొలిసారి జిల్లా రద్దుకు అడుగులు
రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ గతంలో ఏర్పాటైన జిల్లాలను ఏ ప్రభుత్వం రద్దు చేయలేదు. 11 జిల్లాలతో మొదలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం 23 జిల్లాలకు విస్తరించింది. 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. చంద్రబాబు ఆ జిల్లాలను పునర్వ్యస్థీకరించకుండా వదిలేశారు. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది.
గతంలో ఉన్న 13 జిల్లాలను అలాగే ఉంచి కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్తగా మరో 3 జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముందు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చివరికి ఒక విధానం, హేతుబద్ధత లేకుండా రాజకీయ కారణాలతో అన్నమయ్య జిల్లాను లేకుండా చేయాలనే అభిప్రాయానికి వచ్చింది.
రాజంపేట ఛిన్నాభిన్నమే లక్ష్యం
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీకి పట్టు లేకుండాపోవడంతో ఆ నియోజకవర్గాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 2004 నుంచి టీడీపీ అక్కడ గెలవలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో అక్కడ వైఎస్సార్‌సీపీ గెలిచింది. రాజకీయంగా ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఇక పట్టు చిక్కే పరిస్థితులు లేకపోవడంతో జిల్లాల పునర్విభజన ముసుగులో అందులోని అసెంబ్లీ స్థానాలను చెల్లాచెదురు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయడానికి పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా ఆ పేరుతో ఉన్న జిల్లాను రద్దు చేయడం సరికాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పునర్విభజనలో చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లె జిల్లాలో కలపాలని నిర్ణయించారు. దీంతో చిత్తూరు జిల్లా కేవలం ఆరు నియోజకవర్గాలకే పరిమితం కానుంది. 32 మండలాలతో ఉన్న ఆ జిల్లా 26 మండలాలకే పరిమితమై ప్రాధాన్యం కోల్పోనుంది.
తగ్గిపోతున్న బాపట్ల జిల్లా ప్రాముఖ్యం
అలాగే కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తుండగా దాని కోసం బాపట్ల జిల్లా ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. బాపట్ల జిల్లా నుంచి అద్దంకి, నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. దీంతో 25 మండలాలతో ఉన్న బాపట్ల జిల్లా ఇప్పుడు 20 మండలాలకే పరిమితం కానుంది.
పోలవరం లేకుండానే పోలవరం జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాన్ని విచిత్రంగా పునర్వ్యస్థీకరించింది. పోలవరం లేకుండా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసి ప్రస్తుతం చేపట్టిన జిల్లాల పునర్విభజనకు అసలు ప్రాతిపదికే లేదని నిరూపిస్తున్నారు. కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడమేకాకుండా దానికి పక్కనున్న ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం పేరును దానికి పెట్టడం గమనార్హం.
అరకు పార్లమెంటు స్థానం పరిధి ఎక్కువ కావడం, నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో ఈ జిల్లాను పునర్వ్యస్థీకరించడం 2022లోనే సవాలుగా మారింది. అయినా అప్పట్లో దాని విస్తృత పరిధి దృష్ట్యా రెండు జిల్లాలుగా విభజించారు. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. తద్వారా రెండు గిరిజన జిల్లాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే రంపచోడవరం నియోజకవర్గం పాడేరుకు దూరంగా ఉందనే సాకుతో కేవలం ఆ ఒక్క నియోజకవర్గంతోనే ఇప్పుడు కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. పైగా దానికి ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం పేరు పెట్టడం ఇంకా విచిత్రంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం ఒక నియోజకవర్గం కోసం జిల్లా ఏర్పాటు చేయడాన్ని బట్టి తాము చేసిన పునర్వ్యస్థీకరణకు తీరూతెన్నూ లేదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. ఒంగోలు, రాజంపేట, అరకు పార్లమెంటు స్థానాల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఈ పునర్విభజనను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2014లో వదిలేసి ఇప్పుడు తూట్లు పొడుస్తున్న చంద్రబాబు
అమరావతి కోసం చంద్రబాబు 2014–19లో జిల్లాలను పునర్వ్యస్థీకరించకుండా వదిలేయడంతో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక శాస్త్రీయ దృక్పథంతో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను పునర్వ్యస్థీకరించారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకూడదనే ప్రాథమిక సూత్రాల ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.
అలాగే ప్రతి జిల్లాలో జనాభా సగటున 15 లక్షల నుంచి 20 లక్షలు ఉండేలా చూశారు. తద్వారా అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఉండేలా స్వరూపాలను నిర్దేశించారు. ఇందుకోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 76 డివిజన్లుగా పునర్వ్యస్థీకరించారు. చివరికి చంద్రబాబు సుదీర్ఘకాలం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా వైఎస్ జగన్ హయాంలోనే ఏర్పాటైంది. అంత శాస్త్రీయంగా జరిగిన పునర్విభజనను చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం నీరుగార్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
అన్నమయ్య జిల్లాపై నేడు నిర్ణయం
అన్నమయ్య జిల్లా రద్దు అంశాన్ని సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తేల్చుదామని సీఎం చంద్రబాబు అధికారులతో చెప్పినట్టు తెలిసింది. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమైనా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేయడానికి దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లె జిల్లానే అన్నమయ్య జిల్లాగా కొనసాగిస్తున్నట్లు చెప్పాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.
రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లె జిల్లాలో కలిపి జిల్లా కేంద్రంగా మదనపల్లెను చేయాలని దాదాపు ఖరారు చేశారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి తాజాగా పలు మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. వీటన్నింటిపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్రవేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 31న జిల్లాల పునర్విభజనకు సంబంధించిన మార్పులపై తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.


