సాక్షి, తిరుపతి: తెలుగు రాష్ట్రాల్లో జనసేన నేత(మాజీ) వినూత కోట డ్రైవర్ రాయుడి కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. జనసేన తరఫున తమకు న్యాయం కావాలంటూ రాయుడి కుటుంబం నిరసనకు దిగింది. సరిగ్గా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
‘‘పవన్ కల్యాణ్‌గారూ.. మీరే మాకు న్యాయం చేయండి’’ అంటూ శ్రీనివాసులు అలియాస్ రాయుడి కుటుంబ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తిరుపతి కలెక్టరేట్ ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. మా బిడ్డ రాయుడు పవన్ వీరాభిమాని. జనసేన పార్టీ కార్యకర్తగా కూడా ఉన్నాడు. అలాంటోడు చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నా ఆ పార్టీ నుంచి కనీస స్పందన లేదు. ఇప్పటికైనా జనసేన, పవన్ తరఫు నుంచి మాకు న్యాయం జరగాలి’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జులైలో చెన్నై సమీపంలోని కూవం నదిలో గుర్తు తెలియని మృతదేహం ఒకటి కొట్టుకు వచ్చింది. చేతిపై జనసేన రాతల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది జనసేన కాళహస్తి ఇంచార్జి ఇంచార్జి వినూత కోట మాజీ డ్రైవర్ రాయుడిదిగా నిర్ధారణ అయ్యింది. రాజకీయ, వ్యక్తిగత కారణాలతోనే హత్య చేశారని చెబుతూ చెన్నై పోలీసులు.. వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన ఆమెను పార్టీ నుంచి తొలగించింది. అయితే..
ఈ కేసులో వినూత కోట తన ప్రమేయం లేదంటూ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఆపై కోర్టు బెయిల్ ఇవ్వడంతో షరతుల ఆధారంగా ఆమె, ఆమె భర్త చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈలోపు.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి , వినుత మద్య రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. సంచలన వివరాలతో రాయుడి సెల్ఫీ వీడియో ఒకటి బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఆ వెంటనే వినుత కూడా కుట్రలను అన్ని ఆధారాలతో త్వరలోనే బయటపెడతానంటూ సెల్ఫీ వీడియో విడుదల చర్చనీయాంశమైంది. అయితే.. ఇప్పటికీ ఈ వ్యవహారంపై జనసేన, టీడీపీ పార్టీల నుంచి ప్రతిస్పందన లేకపోవడం గమనార్హం.


