82.468 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత | Ration Rice Seized At Two Different Places In Visakhapatnam District, More Details Inside | Sakshi
Sakshi News home page

82.468 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

Jun 7 2025 2:48 AM | Updated on Jun 7 2025 12:05 PM

Ration rice seized at two different places in Visakhapatnam district

తగరపువలస/కూర్మన్నపాలెం: విశాఖ జిల్లాలోని రెండే వేర్వేరు చోట్ల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. ఆనందపురం మండలం పెద్దిపాలెంలో గురువారం రాత్రి రెండు రైస్‌ మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరా, విజిలెన్స్‌ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి 82.468 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భీమిలి ఆర్డీవో సంగీత్‌ మాథూర్, ఆనందపురం తహసీల్దార్‌ శ్యాంప్రసాద్, సీఎస్‌డీటీ శ్రీనివాసరావు జరిపిన తనిఖీలు రాత్రి 9 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగాయి. 

శ్రీబాలాజీ మోడరన్‌ రైస్‌ మిల్లు నుంచి 50.800 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల శాఖ ముద్రతో రీప్రాసెస్‌ చేసి బయటకు తరలించిన బియ్యానికి సంబంధించి 388 గోనె పట్టాలు, అశోక్‌ లే ల్యాండ్‌ లారీని స్వా«దీనం చేసుకున్నారు. అలాగే శ్రీ సాయి రైస్‌ అండ్‌ ఫ్లోర్‌ మిల్లు నుంచి 31.668 టన్నుల బియ్యంతో పాటు 1,252 ఖాళీ గోనె సంచులు, మహీంద్రా బొలేరో వ్యాన్, ఆటోలను స్వా«దీనం చేసుకున్నారు.

రేషన్‌ బియ్యాన్ని నిల్వ ఉంచి, పాలిష్‌ చేసి బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. వీటిని సీజ్‌ చేసి జాయింట్‌ కలెక్టర్‌కు నివేదిక పంపించినట్టు తహసీల్దార్‌ తెలిపారు. ఈ రెండు మిల్లుల యజమానులు చెన్నా రాజేష్, రామారావులపై 6ఏ కేసుతో పాటు 7 బీఎన్‌ఎస్‌ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

1,400కిలోల పీడీఎస్‌ రైస్‌ సీజ్‌ 
పేదలకు అందించాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను దువ్వాడ పోలీసులు పట్టుకున్నారు. ఆటో నుంచి 1,400 కిలోల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గూడ్స్‌ ఆటోలో గాజువాక నుంచి సబ్బవరం రైస్‌ మిల్లుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో దువ్వాడ చెక్‌ పోస్టు వద్ద పోలీసులు పీడీఎస్‌ రైస్‌ను గుర్తించి, స్వా«దీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement