సాక్షి, అమరావతి: రాగల మూడు గంటల్లో ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో వర్షం తేలిక పాటికే పరిమితమైంది. అయితే కర్నూలు నగరంలో భారీ వర్షం కురిసింది.
కర్నూలు రూరల్‌లో 56.2 మి.మీ, కర్నూలు అర్బన్‌లో 48.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లాయి. జిల్లా మొత్తంగా సగటున 9 మి.మీ వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 46.1 మి.మీ వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా మొత్తంగా సగటున 1.7 మి.మీ వర్షం కురిసింది. నంద్యాల జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ కాగా ఇప్పటి వరకు 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తొలకరి నిరాశాజనకంగా సాగుతోంది.


