చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు
పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
బాబు పాలనలో తమకు ఎలాంటి మేలు జరగలేదని రైతుల ఆవేదన
గతంలో ధైర్యంగా బతికాం.. ఇప్పుడు దీనంగా గడుపుతున్నాం
తుపాన్లు, వర్షాలతో అల్లాడిపోయినా సాయం అందలేదని ఆవేదన
పులివెందుల మెడికల్ కాలేజీ రాకుండా చేశారన్న ఓ విద్యార్థి
ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చిన జగన్
సాక్షి కడప: రాష్ట్రంలో పేద ప్రజలు, రైతులంటే దయలేని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వివిధ సమస్యలతో సతమతమవుతున్న వారికి మంగళవారం ఆయన ధైర్యం చెప్పారు. సాయంత్రం నాలుగు గంటలకు పట్టణంలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యారు. ఆయన్ను చూడగానే కార్యాలయ ఆవరణలోని అభిమానులు, ప్రజలు జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం అందరి బాధలు, కష్టాలు విన్నారు.
పరిష్కార మార్గాలు సూచిస్తూ భరోసా కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలు తెలుసుకున్నారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చేయాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు.
అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. అందరి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వరుస తుపాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తామంతా ధైర్యంగా బతికామని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరటితోపాటు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని చెప్పారు. వీటిపై స్పందిస్తూ రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంపై రైతుల తరుఫున పోరాడతామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.
బాబు సర్కార్ తీరుతో సీటు కోల్పోయా

తమ సమస్యను వైఎస్ జగన్‌కు వివరిస్తున్న జయప్రకాశ్, చరణ్ సాయి
నీట్ యూజీలో తనకు 470 మార్కులు వచ్చాయని, అయితే 471 మార్కులు కటాఫ్‌గా రావడంతో సీటు రాలేదని, అదే పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభమై ఉంటే తనకు తప్పకుండా సీటు వచ్చేదని పులివెందులకు చెందిన జయప్రకాశ్ కుమారుడు చరణ్ సాయి వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మీ హయాంలో మీరు 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో ఏడు కళాశాలలు ప్రారంభమవ్వగా, మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పులివెందుల కాలేజీకి అయితే గత ఏడాది సీట్లు కూడా కేటాయించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఆ సీట్లు రద్దు చేయాలంటూ ఎన్‌ఎంసీకి ఏకంగా లేఖ రాసింది. అలా చేయకుండా ఉండివుంటే ఈ ఏడాది నాకు తప్పకుండా ఎంబీబీఎస్ సీటు వచ్చేది’ అని వాపోయాడు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ వైద్య విద్యార్థులకు అన్యాయం చేస్తోందన్నారు. పీపీపీ విధానంతో పేదలకు వైద్యాన్ని అందకుండా చేస్తోందని మండిపడ్డారు. మహోన్నత ఆశయంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, ఉన్నత వైద్యంతోపాటు మెడికల్ విద్యను అందించాలన్న తమ లక్ష్యాన్ని నీరుగారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

దివ్యాంగుడితో ఆప్యాయంగా వైఎస్ జగన్

ముస్లిం అక్కచెల్లెమ్మల సమస్యలను వింటున్న వైఎస్ జగన్

పులివెందుల క్యాంప్ కార్యాలయం వద్ద జగన్‌ను చూసేందుకు పరుగుపెడుతున్న ప్రజలు


