31 జిల్లాల్లోని 564 మండలాల్లో 12,728 పంచాయతీల్లో ఎన్నికలు
వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్
రేపు తొలి విడతకు నోటిఫికేషన్ జారీ... అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ
ఏ దశకు ఆ దశ ఎన్నిక జరగగానే కౌంటింగ్ మొదలు.. ఫలితాల ప్రకటన
బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు.. పత్రాలపై నోటా గుర్తు.. అమల్లోకి ఎన్నికల కోడ్
నోటిఫికేషన్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని
సాక్షి, హైదరాబాద్: పల్లెల్లో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 564 మండలాల్లో 12,728 గ్రామ పంచాయతీల్లోని 12,728 సర్పంచ్, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు (32 జీపీలు, 292 వార్డులు మినహా) మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చేనెల 11న తొలి, 14న రెండో, 17న మూడో విడత జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు.
ఏ దశకు ఆ దశ ఎన్నిక ముగియగానే అదే రోజు సాయంత్రం సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లు లెక్కించాక విజేతలను ప్రకటించనున్నారు. ఈ షెడ్యూల్ జారీతోనే 31 గ్రామీణ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమల్లోకి వచ్చిందని ఆమె తెలియజేశారు. ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తుండగా, బ్యాలెట్ పత్రాల్లో ‘నోటా’ (‘నన్ ఆఫ్‌ద అబౌవ్) గుర్తును కూడా ముద్రించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డా.జి.సృజన, అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరందంలతో కలిసి రాణీకుముదిని నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రత్యేక కాల్‌సెంటర్
హైకోర్టులో ఉన్న వివిధ కేసుల్లో స్టే విధించిన కారణంగా ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలు, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్ పంచాయతీలు, ఖమ్మం జిల్లా ఎన్నూరు మండంలోని 4 జీపీలు, పెనుబల్లి మండలంలోని ఒక గ్రామపంచాయతీకి, అలాగే వీటిలోని మొత్తం 292 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించడంలేదని కమిషనర్ రాణీకుముదిని తెలిపారు. గత సెప్టెంబర్ 29న ఐదు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ను నిలుపుదల చేసినట్టు చెప్పారు.
ప్రస్తుతం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల కోసం రీనోటిఫికేషన్ విడుదల చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లో ఎన్నికల పరిశీలకులను నియమించామని, ఎన్నికల ఉల్లంఘనలపై వారు ఎప్పటికప్పుడు తమకు నివేదికలు పంపిస్తారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల కోసం ఈసారి కొత్తగా ‘గ్రీవెన్స్ మాడ్యూల్’ను ఏర్పాటు చేశామని, త్వరలో అందుబాటులోకి తెస్తున్న యాప్ ద్వారా ఫిర్యాదులు, అభ్యంతరాలు వంటివి స్వీకరిస్తామన్నారు. ఈ ఎన్నికల నిమిత్తం ఎస్‌ఈసీ కార్యాలయంలో 9240021456 నంబర్‌తో కాల్‌సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
నామినేషన్లకు మూడు రోజులు
గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సవరించిన రిజర్వేషన్లను ప్రభుత్వం తమకు సమరి్పంచిందని రాణీ కుముదిని తెలిపారు. దీంతో పంచాయతీలకు రెండో సాధారణ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, జిల్లాలు–గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్లు తదితర అంశాలను గెజిట్‌లలో ప్రచురించినట్టు చెప్పారు. గ్రామీణ స్థానిక సంస్థల పోస్టులకు ఖాళీలు ఏర్పడడంతో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.
ఒక్కో దశను 15 రోజుల్లోగా ముగించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఒక్కో దశకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉన్నట్టుగా వెల్లడించారు. ఆయా తేదీలను బట్టి ఎక్కడికక్కడ రిటరి్నంగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేస్తారని ప్రకటించారు. ఈ ఎన్నికల నోటీఫికేషన్ జారీచేసిన రోజు కలుపుకుని మూడురోజులు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో, శాంతియుతంగా, నియమ నిబంధనలకు లోబడి ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
ఎన్నికలు జరిగే స్థానాలివీ
మొత్తం జిల్లాలు : 31
రెవెన్యూడివిజన్లు : 72
మండలాలు : 564
పంచాయతీలు :12,728
వార్డుల సంఖ్య :1,12,242
పోలింగ్ కేంద్రాలు :1,00,000కు పైగా
గ్రామీణ ఓటర్లు
పురుషులు :81,42,231
మహిళలు :85,12,455
ఇతరులు :500
మొత్తం :1,66,55,186


