
విశాఖలో జ్యోతిరావ్ పూలే విగ్రహానికి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడికి ఖండన
అంబేడ్కర్, పూలే విగ్రహాలకు వినతిపత్రాలు
నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శనలు
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ దాష్టీకం
ఇలా దాడులకు తెగబడితే సహించం
హెచ్చరించిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, బీసీ సంఘాలు
సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ జిల్లా పులివెందులలో టీడీపీ గూండాలు ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ మీద దాడిచేయడాన్ని ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు పెల్లుబికాయి. జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో వేలాదిగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శనలు చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలిచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ నాయకుడు రమేష్ యాదవ్‌పై దాడిచేసిన వారిని అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలుగుదేశం వర్గీయులు ఈ దాడులకు తెగబడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేమని అడ్డదారుల్లో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏడాదన్నరగా కూటమి పాలనలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడుతూ, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని మండిపడ్డారు. రెడ్‌బుక్ పాలన అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు చూసి జ్యోతిరావ్ పూలే ఆత్మ క్షోభిస్తోందన్నారు. అధికారం ఉంది కదా అని బీసీలపై దౌర్జన్యానికి, దాడులకు పూనుకుంటే చూస్తూ సహించబోమన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేశ్ చెప్పినట్లు చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.
శాంతియుతంగా నిరసన
గుంటూరు హిందూ కాలేజీ కూడలి, తిరుపతి బాలాజీ కాలనీ, అనంతపురం జెడ్పీ కార్యాలయం, నెల్లూరు మినీ బైపాస్‌రోడ్డు, కర్నూలులోని బిర్లా సర్కిల్, నంద్యాలలోని పద్మావతినగర్ ఆర్చి, కాకినాడ, ఏలూరు, అనకాపల్లిల్లో జ్యోతిరావ్ పూలే విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల జ్యోతిరావ్ పూలే విగ్రహానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశంచౌక్ సెంటర్‌లో జ్యోతిరావ్ పూలే చిత్రపటంతో ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కాకినాడ జిల్లా ఏలేశ్వరం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిరసన ప్రదర్శనలు చేశారు.