
కర్నూలు: హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నడుపుతున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్‌లైన్‌లో యువకులకు యువతుల ఫొటోలు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ ఇంట్లో కొన్ని నెలలుగా గుట్టుగా వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ సీఐ విక్రమ సింహా, ఎస్‌ఐలు చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డిలు స్థావరంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేసి కటకటాలకు పంపారు. అరెస్టయిన వారిలో 9 మంది నిర్వాహకులు, నలుగురు విటులు ఉన్నారు.
విజయవాడ, అనంతపురం, హైదరాబాదు, నంద్యాల ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను తీసుకువచ్చి వ్యభిచార రొంపిలోకి దింపి వ్యాపారం సాగించేవారు. అమ్మాయిల ఫొటోలను వాట్సాప్‌లో పంపి విటులను ఆకర్షిస్తూ కొంతకాలంగా వ్యాపారం సాగిస్తూ వారిపై వచ్చే ఆదాయాన్ని నిర్వాహకులు వనరుగా మార్చుకున్నారని విచారణలో బయటపడింది. కల్లూరుకు చెందిన ఆళ్ల మధుసూదన్, నందికొట్కూరులోని మద్దూరు సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ రజాక్, కర్నూలు షరీన్ నగర్‌కు చెందిన ఆరెపోగు శేఖర్, బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురానికి చెందిన అరిగెల శ్రీనివాసులు, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన సుజాత, కర్నూలు సంతోష్ నగర్‌కు చెందిన గూగుల్రోజ్ సైలు, నంద్యాల జిల్లా బనగానపల్లె ఈద్గా నగర్‌కు చెందిన షేక్ మాబున్ని, విజయవాడ హనుమాన్ నగర్‌కు చెందిన పులిపాక లక్ష్మి, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన పోలిరెడ్డి భార్య అన్యం నారాయణమ్మ కలసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు.
నిర్వాహకులతో పాటు విటులు కురువ రవిబాబు, బింగి బాల అంకన్న, జయకృష్ణ, మిఠాయి పరుశురాం లాల్ తదితరులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. నిర్మాణుష్య ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇలాంటి వ్యభిచార గృహాలు నిర్వహిస్తారని, ఇంటి యజమానులు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా వ్యభిచార కార్యకలాపాలు సాగుతుంటే డయల్ 112 లేదా 91211 01062 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.