నల్లమలలో పులి భద్రమేనా?
● అడవిలో కనిపించిన పులి పంజా ఉచ్చు ● అప్రమత్తమైన అటవీ అధికారులు
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ –శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్)విస్తీర్ణంలో దేశంలోనే పెద్దది. రెండు తెలుగు రాష్ట్రాలలో 3,728 చ.కిమీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇటీవల గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యాన్ని కూడా ఎన్‌ఎస్‌టీఆర్‌లో విలీనం చేయడంతో 1,194 చ.కిమీ అదనంగా చేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 87 పెద్ద పులులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నల్లమలలో పెద్దపులుల భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయి. అడవిలో అక్రమార్కుల కారణంగా ఉచ్చులు పెరిగిపోతున్నాయి. మాంసాహారం కోసం పులి ఆహారమైన దుప్పులు, జింకలు, అడవి పందులను ఉచ్చులు పెట్టి చంపుతున్నారు. అప్పుడప్పుడు ఈ ఉచ్చులకు పెద్దపులులు చిక్కుకుని మరణించడం వంటి సంఘటనలు తరుచు జరుగుతున్నాయి.
నాగలూటిలో టైగర్ జా ట్రాప్ లభ్యం
ఇటీవల ఎన్‌ఎస్‌టీఆర్ పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో నాగలూటి ప్రాంతంలో పెద్దపులులను బంధించేందుకు వాడే టైగర్ జా ట్రాప్ లభ్యమవడం అటు అటవీ అధికారులలోనూ, ఇటు వన్యప్రాణి ప్రేమికులలోను ఆందోళనకు కారణమైంది. ఇలాంటి ట్రాప్‌లు అంతర్జాతీయ స్మగ్లర్లు మాత్రమే వినియోగిస్తారన్న అనుమానాలున్నాయి. నల్లమలలో పులుల ప్రవర్ధనం స్మగ్లర్లను ఆకర్షించి ఉండవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
అనుమానితుల
వివరాలు సేకరణ
పులులను పట్టుకునేందుకు వినియోగించే జాట్రాప్ నల్లమలలో కనిపించడంతో అప్రత్తమైన అటవీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా అపరిచితుల సమాచారం కోసం అటవీ సమీప పట్టణాలలోని లాడ్జీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలకు ఆత్మకూరు పట్టణంలో ఒక లాడ్జి నుంచి మరో లాడ్జికి వారు వెళ్లేలోగా అక్కడ రిసెప్షన్‌లో ఉండాల్సిన రిజిస్టర్ మాయమైనట్లు గుర్తించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక అగంతకుడు లాడ్జి రిసెప్షన్ వద్దకు వచ్చి అక్కడ అల్మారాలు వెతికి రిజిష్టర్‌ను తన చొక్కా లోపల పెట్టుకుని బయటకు వెళ్లడం కనిపించింది. అలా వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి గురించి అటవీ అఽధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల చిత్రమైన వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి తరుచూ నంద్యాల అటవీ డివిజన్‌లో పలు చోట్ల కనిపించినట్లు అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి హిందీ మాత్రమే మాట్లాడుతూ కాస్త మతిస్థిమితం లేనట్టుగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. అనుమానంతో అతన్ని ఎంతగా ప్రశ్నించినా ఎలాంటి సమాచారం అధికారులకు వెళ్లడి కాలేదు. దీంతో ఎన్‌ఎస్‌టీ ఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ అనుమానితుడి వేలి ముద్రలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోకు పంపించారు.అక్కడ నుంచి నివేదిక రావాల్సి ఉంది.
సిబ్బంది కొరత
పులి సంరక్షణకు సిబ్బంది కొరత తీవ్ర అంతరా యం కలిగిస్తోంది. పెద్దపులుల అభయారణ్యాలలో ప్రొటెక్షన్ వాచర్లపై ఆధార పడి ఉన్న సిబ్బందితోనే ఇబ్బంది పడుతూ అటవీ శాఖ పులి సంరక్షణకు పాటు పడుతోంది. కంటికి కనించని ప్రాంతాల్లో పన్నే ఉచ్చులను కనుక్కుని తొలగించడం వారికి కష్టసాధ్యమవుతోంది.
నల్లమలలో వృద్ధి చెందుతున్న పులి సంతతి


