రౌడీషీటర్ల లొకేషన్లు జియోట్యాగ్ చేయండి
కర్నూలు: రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్లు ఉన్న వారి ఫొటోలు, ఆధార్, బ్యాంకు వివరాలు, ఫోన్ నెంబర్‌తో కలిపి లొకేషన్ జియోట్యాగింగ్ చేసి సీసీ టీఎన్‌ఎస్‌లో అప్‌లోడ్ చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించి స్టేషన్ల వారీగా పెండింగ్, నమోదైన కేసులపై సమీక్షించారు. ఏడాది ముగుస్తున్నందున రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి జనవరి నుంచి ప్రతి రౌడీషీటర్ సమాచారం సేకరించి జియోట్యాగింగ్ చేయాలన్నా రు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఎక్కువ కేసులు నమోదైన వారిపై జిల్లా బహిష్కరణ, పీడీ యాక్ట్ నమోదు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ప్రొబేషనరీ ఎస్‌ఐలు బాగా పనిచేయాలి
కొత్తగా విధుల్లో చేరిన ప్రొబేషనరీ ఎస్‌ఐలు బాగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లతో పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయించాలన్నారు. ఉలిందకొండ పరిధిలో ఏటీఎం చోరీకి ప్రయత్నించిన కేసులో డీజీపీ నుంచి ఏబీసీడీ అవార్డు పొందిన పోలీసులను, గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, హేమలత, భార్గవి, సీఐలు, ఎస్‌ఐలు సమావేశంలో పాల్గొన్నారు.


