కూటమి కుట్రలతో ఐపీఎస్‌ల బెంబేలు | Pressure on Nellore SP Krishnakanth for illegal arrest of Kakani | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలతో ఐపీఎస్‌ల బెంబేలు

Apr 11 2025 5:14 AM | Updated on Apr 11 2025 5:14 AM

Pressure on Nellore SP Krishnakanth for illegal arrest of Kakani

కాకాణి అక్రమ అరెస్టు కోసం నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌పై ఒత్తిడి 

ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ డీజీపీ గుప్తా ఆగ్రహం 

తీవ్ర ఒత్తిడితో అస్వస్థతకు గురైన ఎస్పీ  

నివాసంలో మెట్లపై నుంచి కిందపడ్డ అధికారి.. ఆయనపై బదిలీ వేటుకు సిద్ధపడ్డ ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: చంద్రబాబు సారథ్యంలోని కూట­మి ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రలు, అరాచకాలను అమలు చేయలేక పోలీసు శాఖ బెంబేలెత్తుతోంది. వైఎస్సార్‌­సీపీ ముఖ్య నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఏకంగా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తుండడంతో పోలీసు ఉన్నతాధికా­రులు హడలెత్తిపోతున్నారు. కొందరు మానసిక ఒత్తిడితో అస్వస్థత పాలవుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరా­ములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ హఠాత్తుగా అస్వస్థతకు గురికావడం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వైఎస్సార్‌­సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిన విష­యం తెలిసిందే. అయితే, ఆయ­నపై వరుస కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఈ వ్యవహా­రాన్ని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాతో పాటు రిటైర్డ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఒత్తిడి తీవ్రం చేశారు. 

కాకాణిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను హైదారాబాద్‌కు పంపించారు. ప్రభుత్వ పెద్దలు, పోలీస్‌ బాస్‌లు అంతటితో సంతృప్తి చెందలేదు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నమో­దైన పలు కేసుల్లో కాకాణి  పేరును ఇరికించాలని కూడా ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రతి రోజూ   నిలదీస్తు­న్నారు. ఈ పరిణామాలతో ఎస్పీ కృష్ణకాంత్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. 

ఓ పరిమితి వరకు నిబంధనలకు కాస్త అటూ ఇటూగా ఉల్లంఘించగలంగానీ...   బరితెగించి అక్రమ కేసులు, వేధింపులు ఐపీఎస్‌ అధికారిగా తనకు సాధ్యం కాదని ఆయన భావించారు. చట్ట పరిధిలోనే కేసులను దర్యాప్తు చేయగలను తప్ప.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు సాధనంగా మారలేనంటూ ఆయన లోలోన మథన పడుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

తీవ్రంగా మందలించిన పోలీస్‌ బాస్‌
కాకాణిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని నిలదీస్తూ.. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఎస్పీ కృష్ణకాంత్‌పై గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్పీపై మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. ఆయన తన నివాసంలో మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఒత్తిడితో ఎస్పీ కృష్ణకాంత్‌ బీపీ పడిపోయిందని వైద్యులు చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని రోజలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 

కొత్త ఎస్పీగా టీడీపీ వీర విధేయ సుబ్బారాయుడు!
రెడ్‌బుక్‌ కుట్ర అమలులో అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరించనందుకు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఆయనను బదిలీ చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ సానుభూతిపరుల కుటుంబానికి చెందిన, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితు­డిగా గుర్తింపు పొందిన ఐపీఎస్‌ అధికారి సుబ్బారా­యు­డును నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. 

తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. తిరుపతి ఎస్పీగా నియమితులయ్యారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో పోలీసుల వైఫల్యంతో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనికి బాధ్యుడిగా తిరుపతి ఎస్పీ సుబ్బారా­యు­డును ప్రభుత్వం సస్పెండ్‌ చేయాలి. కానీ, బదిలీతో సరిపెట్టింది. 

అనంతరం  ‘ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌’ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్‌ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)లో సభ్యుడిగా సుబ్బారాయుడును నియమించారు.  

Advertisement
 
Advertisement
Advertisement