సాక్షి, న్యూఢిల్లీ/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం విజయవాడకు రానున్నారు. బుధ, గురువారాల్లో ఆమె విజయవాడలో పర్యటించనున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్రపతి నేడు దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కొండపై వాహనాల రాకపోకలు, ప్రొటోకాల్ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు.
మధ్యాహ్నం 1.00 గంట నుంచి అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఎలాంటి ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని దేవదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ప్రకటించారు. ఉదయం 6.00 నుంచి 8. 00 గంటల వరకు ఉండే ప్రొటోకాల్ దర్శనాలను మరో గంటపాటు పొడిగించి, రాత్రి 7.45 గంటల నుంచి కేటాయించిన స్లాట్ను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే, గురువారం విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సారస్ మేళాలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.


