భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ప్రతి సాయి భక్తుడువిశ్వ శాంతి సాధనకు కృషి చేయాలి
ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిపోయిన లవ్ ఆల్.. సర్వ్ ఆల్ నినాదం
ఉచిత వైద్యం, విద్య,తాగు నీటి ప్రాజెక్టులు అమోఘం
ఇదే స్ఫూర్తితో ధార్మిక, సేవా సంస్థలు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
ప్రశాంతి నిలయం: సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలు, మానవతా విలువలు విశ్వశాంతికి మార్గదర్శకాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. విశ్వశాంతి సాధనకు ప్రతి సాయి భక్తుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయి శత జయంతి వేడుకల్లో శనివారం ఆమె పాల్గొన్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరానికి వచ్చారు.
అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆమె సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని, పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ సేవయే మాధవ సేవ అంటూ సత్యసాయి ఇచ్చిన సందేశం స్ఫూర్తిదాయకమన్నారు.
సత్యసాయి బోధనలు, సేవా కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ముందుకు నడిపిస్తున్నాయని చెప్పారు. సాయి ఇచ్చిన లవ్ ఆల్.. సర్వ్ ఆల్.. నినాదం ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడి పోయిందన్నారు. బాబా బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి మానవతా విలువలు భక్తుల మదిలో పాఠ్యాంశాలుగా నిలిచిపోయాయని తెలిపారు. విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందించిన సత్యసాయి ఎందరో పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారని కొనియాడారు.
మహిళా సాధికారతకూ పాటుపడ్డారని, ఇందుకు 1969లో అనంతపురంలో నెలకొల్పిన మహిళా క్యాంపస్ నిదర్శనం అని గుర్తు చేశారు. ఉచిత విద్యతో పాటు నయా పైసా ఖర్చులేని నాణ్యమైన వైద్యం, కరువు ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు అమోఘమన్నారు. ఇదే స్ఫూర్తితో భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడూ కృషి చేయాలన్నారు.
దేశాభివృద్ధిలో ధార్మిక సంస్థలు, సేవా సంస్థలు, ఎన్జీఓలు, ప్రయివేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సత్యసాయి శత జయంతి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం సత్యసాయి శత జయంతి వేడుకలలో భాగంగా ప్రపంచ శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 140 దేశాల గూండా పయనించే శాంతి కాగడాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెలిగించారు.
సత్యసాయి మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి
సత్యసాయి బోధనలను ప్రతి ఒక్కరూ అచరించడం ద్వారా ఉత్తమ సమాజాన్ని స్థాపించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యసాయి స్ఫూర్తిని ప్రతి సాయి భక్తుడూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. మానవాళి సౌభాగ్యం కోసం సత్యసాయి చేపట్టిన తాగునీరు, ఉచిత వైద్యం, విద్య ప్రాజెక్టులు ఆదర్శనీయమన్నారు. రాబోయే రోజుల్లో సత్యసాయి సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపట్టిన గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. తొలుత ఆర్‌జే రత్నాకర్ రాజు ప్రారంబోపన్యాసం చేస్తూ సత్యసాయి ట్రస్ట్ చేపట్టిన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య, ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి, డాక్టర్ మోహన్, నాగానంద తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె పుట్టపర్తికి వెళ్లారు. రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి వీడ్కోలు పలికారు. కాగా, ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన 2వ ‘భారతీయ కళా మహోత్సవం’ప్రారంభించారు.
నేడు పుట్టపర్తికి సీఎం రేవంత్
ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు. పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ హాల్‌లో జరిగే శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరవుతారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. పుట్టపర్తి వెళ్లేందుకు సీఎం రేవంత్ శనివారం రాత్రి బెంగళూరుకు విమానంలో వెళ్లారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఆదివారం ఉదయం పుట్టపర్తికి వెళ్లనున్నారు.


