ఆయన | - | Sakshi
Sakshi News home page

ఆయన

Jan 7 2026 7:21 AM | Updated on Jan 7 2026 7:21 AM

ఆయన

ఆయన

‘పైన పొత్తులు.. లోన కత్తులు’ అన్న చందాన తయారైంది జిల్లాలో కూటమి పరిస్థితి. ముఖ్య నేతలు పైన అంతా బాగుందనే కలరింగ్‌ ఇస్తున్నా కిందిస్థాయిలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. పార్టీలోనే ఉన్నా పనులు కాకపోవడంతో పలు చోట్ల ‘తమ్ముళ్లు’ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

పెనుకొండలో మంత్రి సవిత వర్సెస్‌ ఎంపీ పార్థసారథి

ధర్మవరంలో అడకత్తెరలో పోక చెక్కలా ‘పచ్చ’ నాయకులు

హిందూపురంలో బాలయ్య పీఏల మధ్య విభేదాలతో ‘తమ్ముళ్ల’ అవస్థలు

మడకశిరలో ‘మూడు’ ముక్కలాట

పనులు జరగక బహిరంగంగానే టీడీపీ కార్యకర్తల అసమ్మతి గళం

సాక్షి, పుట్టపర్తి: తామందరూ ఒకే తాటిపై ఉంటా మని పెద్ద నాయకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి పార్టీల నాయకుల మధ్య సమన్వయ లేమి నెలకొంది. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, రేషన్‌ డీలర్‌ల పోస్టులు ఖాళీగా ఉండడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఇరు పార్టీలతో కలిసి నడుస్తున్నా కింది స్థాయిలో మాత్రం నాయకులు అధికార పెత్తనం కోసం పాకులాడుతుండడం గమనార్హం.

చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరంభంలో ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌ హవా నడిచింది. మంత్రి సత్యకుమార్‌ తెచ్చుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ను మార్చే వరకు పట్టుబట్టి నెగ్గాడు. అయితే ఆ తర్వాత శ్రీరామ్‌ హవా తగ్గింది. మంత్రి అనుచరులు అన్నీ తామై వ్యవహరిస్తుండటంతో ఆయనకు దిక్కు తోచడం లేదు. అంతేకాకుండా ముదిగుబ్బలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల నియామకంలో ఇరు పార్టీల మధ్య పోటీ నెలకొని.. ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి. అధికారుల నియామ కాల్లో కూడా మంత్రి పైచేయి సాధిస్తున్నారు. దీంతో ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్‌ పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ముదిగుబ్బలో బీజేపీకి చెందిన ఎంపీపీ, టీడీపీకి చెందిన మండల కన్వీనర్‌ మధ్య ఆధిపత్య పోరు నెలకొనడంతో మండల వ్యాప్తంగా ఏ ఒక్క గ్రామంలో కూడా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల నియామకం జరగకపోవడంతో ‘తమ్ముళ్ల’ నుంచి అసమ్మతి గళం వినిపిస్తోంది.

పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి వర్గాల నడుమ ఆధిపత్య పోరు తారస్థాయికి చేరినట్లు తెలిసింది. రొద్దం మండల ప్రజలపై మంత్రి సవిత కక్ష సాధిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ.. పెనుకొండలో చిన్న పని కూడా చేసుకోలేని స్థితిలో ఎంపీ పార్థసారథి అసంతృప్తిగా ఉన్నారు. అధికారులందరూ మంత్రి కనుసన్నల్లో పని చేస్తుండటంతో ఎంపీ వర్గీయుల మాట చెల్లడం లేదు. దీంతో తామందరం సీనియర్లు అంటూ బీకే వర్గీయులు చాలాసార్లు అధిష్టానం వద్ద విన్నవించినట్లు తెలిసింది. మంత్రి సవితకు తెలియకుండా ఎంపీ పార్థసారథి ఏ చిన్న పని కూడా చేయలేని స్థితిలో ఉన్నారు.

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. అధిష్టానం వద్ద ఈరన్న లాబీయింగ్‌ చేస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు వద్ద గుండుమల తిప్పేస్వామి హవా నడిపిస్తున్నారని సమాచారం. అయితే స్థానికంగా ఏం చేయాలన్నా.. మాజీ ఎమ్మెల్సీ పెత్తనం ఏంటని ఎమ్మెల్యే వర్గం ఒకట్రెండు సార్లు చర్చించినట్లు తెలిసింది. దీంతోనే కొన్ని రోజులుగా గుండుమల ముభావంగా ఉన్నట్లు సమాచారం. ఇదే అదనుగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్‌ సునీల్‌కుమార్‌ మంత్రి నారా లోకేశ్‌తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల మధ్య విభేదాలతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ చుట్టపుచూపుగా హిందూపురం వస్తుంటారు. అయితే ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌ ఎమ్మెల్యేల తరహాలో సురేంద్ర, పి.శ్రీనివాసరావు వ్యవహరిస్తుంటారు. మరోవైపు బాలాజీ, వీరయ్య పీఏలుగా చెలామణి అవుతుంటారు. నియోజకవర్గ పాలన నలుగురు వ్యక్తుల చేతుల్లో నడుస్తోంది. కేటగిరీలుగా విభజించుకుని తలా ఓ విభాగంలో పెత్తనం చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఎన్నో ఏళ్లుగా పని చేసిన బాలాజీకి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అలకబూనినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం సురేంద్రదే అన్న చందంగా మారింది.

‘పురం’లో

పెనుకొండలో మంత్రి వర్సెస్‌ ఎంపీ

దిక్కు తోచని పరిటాల శ్రీరామ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement