గుండుమల కేజీబీవీ ప్రిన్సిపాల్ అవుట్
మడకశిర: మండలంలోని గుండుమల కేజీబీవీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఎస్‌హెచ్ చాందినిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ మంగళవారం ఏపీ సమగ్రశిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దేవరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఉద్యోగానికి సంబంధించిన కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌ను రద్దు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిబంధనలు ఉల్లంఘించడం తదితర కారణాలతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. వివరాలు.. గుండుమల కేజీబీవీని గత ఏడాది డిసెంబర్ 12న ఉదయం 8 గంటలకు స్థానిక ఎంఈఓ భాస్కర్ సందర్శించారు. టెన్త్ విద్యార్థుల వంద రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్, పలువురు టీచర్లు లేని విషయాన్ని గుర్తించిన ఎంఈఓ వారికి షోకాజ్ జారీ చేశారు. ప్రిన్సిపాల్, టీచర్ల ద్వారా వివరణ తీసుకున్న ఎంఈఓ అనంతరం నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. అయితే, ప్రిన్సిపాల్ ఇచ్చిన వివరణపై ఉన్నతాధికారులు సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే కలెక్టర్ శ్యాంప్రసాద్ కూడా గుండుమల కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. కలెక్టర్ పర్యటన అనంతరం సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ దేవరాజు కేజీబీవీని సందర్శించి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సిబ్బందిలో కలవరం..
మడకశిర నియోజకవర్గంలో గుండుమలతో పాటు అమరాపురం,కరికెర,అగళి, రొళ్లలో కేజీబీవీలు ఉన్నాయి. వీటి నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. గుండుమల కేజీబీవీ ప్రిన్సిపాల్ చాందినిని ఉద్యోగం నుంచి తొలగించిన నేపథ్యంలో ఆయా కేజీబీవీల్లో పని చేస్తున్న ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కలవరపాటుకు గురైనట్లు తెలుస్తోంది.
గతంలోనే ‘సాక్షి’ కథనం..
నియోజకవర్గంలో కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విషయంపై గత ఏడాది డిసెంబర్ 10న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ప్రధానంగా గుండుమల కేజీబీవీ నిర్వహణ తీరుపై ఫోకస్ చేసింది. ‘సాక్షి’ కథనంతో కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు విచారణ చేసి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవడం గమనార్హం.
విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు
నిర్లక్ష్యం, నిబంధనల
ఉల్లంఘనలకు ఫలితం


