రాప్తాడులో మార్పు మొదలు
రాప్తాడు రూరల్: రాప్తాడు నియోజకవర్గంలో మార్పు మొదలైంది. పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడి జీవితాలను త్యాగం చేసిన కార్యకర్తలకు టీడీపీలో న్యాయం చేకూరలేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే నేతల తీరుపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. కొందరు బయటకు చెప్పుకోలేక లోలోన మదన పడుతుంటే, మరికొందరు పార్టీ మారి తమ అసహనాన్ని బయటపెట్టుకుంటున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల పంచాయతీ పరిధిలో టీడీపీకి చెందిన 20 కుటుంబాలు మంగళవారం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరాయి. అనంతపురంలోని తోపుదుర్తి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారందరికీ పార్టీ కండువాలు కప్పి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ సీనియర్ నాయకులు నాగేపల్లి శంకరప్ప, నాగేపల్లి సత్యనారాయణ, బూడిద అక్కులప్ప, బూడిద నాగరాజు, తలారి రంగప్ప, తలారి ఆంజనేయులు, తలారి మురళి, కోడిపల్లి ఈశ్వరప్ప, కట్టుబడి ఆంజనేయులు, పాతపాళ్యం అక్కులప్ప, నీళ్ల చిరంజీవి, కమ్మర శ్రీరాములు, కమ్మర అంజి, దాసరి కదిరప్ప, పల్లెన్న, కురుబ బోసే రామాంజి, తలారి సంజీవ, దళవాయిపల్లి చిరంజీవి, మేకల పోతన్న కుటుంబాలు ఉన్నాయి. టీడీపీలో సుదీర్ఘకాలంగా పని చేశామని, కష్టపడిన వారికి గుర్తింపు లేకపోవడంతో పార్టీని వీడాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. తాము పదవులు ఆశించి పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తమ కష్టాన్ని గురిస్తే చాలని అన్నారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలకే టీడీపీని కార్యకర్తలు, నాయకులు వీడుతున్నారంటే వారిని పరిటాల కుటుంబం ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేసిందో అర్థమవుతోందన్నారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకు పరిటాల సునీత ప్రయత్నిస్తోందన్నారు. పరిటాల కుటుంబం మాయలో పడి గ్రామాల్లో ఎట్టి పరిస్థితు ల్లోనూ కులాలు, వర్గాలుగా విడిపోవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ సీకేపల్లి మండల కన్వీనరు డోలా రామచంద్రారెడ్డి, ఎంపీపీ నారాయణస్వామి, వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, పార్టీ వలంటీరు విభాగం జిల్లా అధ్యక్షుడు ఓబుగారి హరినాథరెడ్డి, నాయకులు మందల నరసింహులు, మనేరు నరసింహులు, వెంకటంపల్లి సత్తిరెడ్డి, ముష్టికోవెల పంచాయతీ సర్పంచు కోనప్ప పాల్గొన్నారు.
పరిటాల కుటుంబానికి
షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు
చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల
పంచాయతీ నుంచి 20 కుటుంబాలు
వైఎస్సార్‌సీపీలోకి చేరిక


