ధ్వంసమైన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న నేతల్ని అడ్డుకున్న పోలీసులు
సాక్షి, పుట్టపర్తి/కదిరి: హిందూపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. శనివారం హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి తెగబడిన నేపథ్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన నాయకులు ఆదివారం హిందూపురం బయలుదేరారు. అయితే, వారందరినీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని నిర్బంధంలో ఉంచారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్ రెడ్డిని కదిరిలో అడ్డుకుని హిందూపురం వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పెనుకొండ నుంచి హిందూపురం బయలుదేరిన మాజీ మంత్రి, పార్టీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ను హిందూపురం రానివ్వలేదు. పెనుకొండలోనే అడ్డుకోవడంతో ఆమె అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
హిందూపురం చేరుకున్న పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులను స్థానిక ఇందిరమ్మ కాలనీ వద్ద అడ్డుకున్నారు. తమ పార్టీ కార్యాలయాన్ని సందర్శించేందుకు ఎందుకు అనుమతించరంటూ పార్టీ నేతలు పోలీసులపై తిరగబడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వారిని అక్కడి నుంచి పెనుకొండకు తరలించారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అనంతపురంలోనే హౌస్ అరెస్టు చేశారు. పుట్టపర్తి నుంచి వెళ్లకూడదని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
ధర్మవరం నుంచి హిందూపురం వెళ్లరాదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఇంటి వద్దనే అడ్డుకున్న పోలీసులు ఆంక్షలు విధించారు. కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్‌ను లేపాక్షి మండలం చోళసముద్రం టోల్‌ప్లాజా వద్ద అడ్డుకుని.. బలవంతంగా లేపాక్షి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ నేత వేణురెడ్డిని పట్టణంలో గృహ నిర్బంధం చేశారు. ర్యాలీలు, నిరసనలు చేయకూడదని షరతులు విధించారు. ఆయన పోలీసుల తీరుపై మండిపడటంతో చివరకు బయటకు వదిలారు.
అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు
వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక భర్త, పార్టీ నేత వేణురెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. రామప్ప అనే ఎస్‌సీ కులానికి చెందిన వ్యక్తితో హిందూపురం వన్ టౌన్ స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు. ఆయనతో పాటుగా పార్టీ బూత్ కమిటీల జిల్లా అధ్యక్షుడు వాలీ్మకి లోకేష్, దివాకర్, వసీమ్, నవీన్, మనోజ్, ఇర్ఫాన్‌లపైనా కేసులు నమోదయ్యాయి.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే టీడీపీ గూండాలు హిందూపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయనను పోలీసులు కదిరిలో అడ్డుకుని పార్టీ నేత పూల శ్రీనివాసరెడ్డి గృహానికి తీసుకెళ్లి హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రాజ్యాంగేతర శక్తులు పాలిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ధ్వజమెత్తారు.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రోద్బలంతోనే ఆయన పీఏల ఆదేశాల మేరకు టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటరీ పరిశీలకుడు రమేష్ రెడ్డి అన్నారు. హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక, మడకశిర సమన్వయకర్త ఈర లక్కప్ప, మాజీ ఎంపీ తలారి రంగయ్యతో కలిసి ఆదివారం హిందూపురంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని పరిశీలించారు.


