బేకరీల్లో మోసం
రాయదుర్గం టౌన్: నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులను మోసం చేస్తున్న పలు బేకరీ దుకాణాల నిర్వాహకుల బాగోతాన్ని తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ బట్టబయలు చేశారు. రాయదుర్గం, ఉరవకొండ, విడపనకల్లు, కణేకల్లులో ఏర్పాటు చేసిన పలు బేకరీల్లో గుంతకల్లు లీగల్ మెట్రాలజీ అధికారి శంకర్ బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 100 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ తక్కువ బరువుతో కేక్‌లను తయారీ చేసి కిలో బరువు ఉన్నట్లుగా విక్రయాలు సాగిస్తున్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో తక్కువ తూకాలతో మోసానికి పాల్పడుతున్న విడపనకల్లులోని మూడు బేకరీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి రూ.27 వేలు జరిమానా విధించారు. అలాగే ఉరవకొండలో 4 కేసులు నమోదు చేసి రూ.41 వేలు, కణేకల్లులో 2 కేసులు నమోదు చేసి రూ.20 వేలు, రాయదుర్గంలో ఒక కేసు నమోదు చేసి రూ.15 వేలు జరిమానా విధించారు. రాయదుర్గంలో రాత్రి 11 గంటలవుతున్నా తనిఖీలు కొనసాగించడం గమనార్హం.
● లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ తనిఖీలో వెలుగు చూసిన అక్రమాలు
● 10 కేసుల నమోదు


