సంబరం మాటున సైబర్ ఉచ్చు
ధర్మవరం అర్బన్: నూతన సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరూ వారి ఎస్‌ఎంఎస్, వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లలో వచ్చే లింక్‌లు, ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ పరిపాటిగా మారింది. అయితే ఇలాంటి చర్యలతో వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయనే విషయాన్ని మరవరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని అందే సందేశాల లింక్‌లను ఎలాంటి పరిస్థితుల్లోనూ తెరవరాదని సూచిస్తున్నారు. అవసరమైతే నేరుగా బంధుమిత్రులకు ఫోన్ చేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకోవాలని, సందేశాలతో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
గిఫ్ట్ ఓచర్లతో బురిడి...
నూతన సంవత్సరం రాకతో ఇదే అదనుగా అమాయకులపై సైబర్ నేరగాళ్లు ఉచ్చు విసిరారు. ఈ క్రమంలో వాట్సాప్‌లకు న్యూ ఇయర్ విసెస్ చెబుతూ గిఫ్ట్ ఓచర్ గెలుచుకున్నారని వచ్చే లింక్‌లు, ఏపీకే ఫైళ్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ తెరవకుండా ఉండడమే మేలు. పొరపాటున ఆ లింక్‌లను క్లిక్ చేస్తే వ్యక్తిగత బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ కావడమే కాక, మొబైల్‌లోని కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వివరాలు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతాయి. అనంతరం సైబర్ నేరగాళ్లు చేసే బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది.
రెండు రోజులు లింక్‌లకు దూరం..
న్యూ ఇయర్ అంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్‌ఎంఎస్‌లకు వచ్చే లింక్‌లు, ఏపీకే ఫైళ్లను తెరవకుండా రెండు రోజులు దూరంగా ఉండాలి. ట్రావెల్ గ్యాడ్జెట్స్, గిఫ్ట్ ఓచర్లు, వస్తువులపై 50 శాతం డిస్కౌంట్, ఈ సందేశం నలుగురికి పంపితే రీచార్జ్.. ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు వల పన్ని బ్యాంక్ ఖాతాలను లూటీచేస్తారు. ఇలాంటి తరుణంలో ఈ రెండు రోజులు ఎలాంటి లింక్‌లు క్లిక్ చేయకుండా ఉండడమే మేలు.
అప్రమత్తంగా ఉండాలి
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో వాట్సాప్‌లకు వచ్చే లింక్‌లను ఎవరూ క్లిక్ చేయొద్దు. అది సైబర్ నేరగాళ్ల పన్నాగమై ఉండవచ్చు. ఎవరికై నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపాలనుకుంటే నేరుగా ఫోన్ చేసి చెప్పండి. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలి.
– హేమంత్‌కుమార్, డీఎస్పీ, ధర్మవరం
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో
ఆర్థిక నేరాలకు ఆస్కారం
ఏపీకే ఫైళ్లు... లింక్‌లతో
జాగ్రత్త అంటున్న పోలీసులు
సంబరం మాటున సైబర్ ఉచ్చు


