ఆలయాల రక్షణలో సర్కారు బాధ్యతారాహిత్యం
● ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం
అనంతపురం: రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు చోటు చేసుకుంటున్నా అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ మాజీ సలహాదారు (దేవదాయ) జ్వాలాపురం శ్రీకాంత్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి నాడు ద్రాక్షారామంలో ముక్కంటికి జరిగిన అపచారం భక్తులను కలచివేసిందన్నారు. సప్త గోదావరి తీరంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోని కపాలేశ్వరస్వామి శివలింగాన్ని దుండగులు ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. ఈ ఆలయాన్ని 7, 8 శతాబ్దాల మధ్య చాళుక్య భీముడు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోందన్నారు. అంతటి ప్రాచీన శివాలయానికి సైతం చంద్రబాబు పాలనలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. శివలింగాన్ని ధ్వంసం చేస్తే అధికారులు హుటాహుటిన కొత్త శివలింగాన్ని ప్రతిష్టించి భక్తులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కొత్త శివలింగం ప్రతిష్టాపనను శాస్త్రోక్తంగా నిర్వహించాల్సి ఉండగా, అవేవీ పట్టనట్టుగా ధర్మాన్ని ఆలయ అధికారులు అవమానపరిచారని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న సనాతన ధర్మకర్త, డీసీఎం పవన్‌కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉండారో చెప్పాలన్నారు. ప్రశ్నిస్తే తన డిప్యూటీ సీఎం పదవి పోతుందన్న భయం పవన్ కళ్యాణ్‌లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత శ్యాంసుందర్ పాల్గొన్నారు.


