చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటాం
● సింహాచల మాన్యం అన్యాక్రాంతం కానివ్వం
● విశ్వహిందూ పరిషత్తు హెచ్చరిక
అనంతపురం కల్చరల్: పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచల ఆలయ మాన్యం భూములను ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబును జిల్లా విశ్వహిందూ పరిషత్తు నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం డీఆర్వో మలోలను వీహెచ్‌పీ నేతలు కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు తాళంకి రత్నమయ్య, ఉపాధ్యక్షుడు రమణబాబు మాట్లాడుతూ.. సింహాచల భూములను దొడ్డి దారిన తన ఇష్టానుసారంగా పంచేయాలన్న సీఎం చంద్రబాబు కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. తాత్కాలిక ప్రయోజనాలను చూడకుండా జాతి సంరక్షణకు పాటుపడాలని హితవు పలికారు. అలా కాదని దేవదాయ శాఖను బలిపశువును చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. ఎక్కడ దేవుని మాన్యం అన్యాక్రాంతమైనా తీవ్ర ప్రతిఘటనతో అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ కార్యదర్శి విశ్వనాథరెడ్డి, జిల్లా గోరక్షా ప్రముఖ్ సోమశేఖర్, కిషోర్, హరీష్ పాల్గొన్నారు.


