‘లా నేస్తం’ అమలు చేయాలి
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా... నేటికీ లా నేస్తం పథకం అమలు చేయకుండా జూనియర్ న్యాయవాదులను ఇబ్బందులకు గురిచేస్తోందని జిల్లా న్యాయవాదులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సి. హనుమన్న విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమన్న మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన లా నేస్తం పథకాన్ని కొనసాగించడంతో పాటు ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీని విస్మరించడం తగదన్నారు. ఇచ్చిన హామీని అమలు చేసి జూనియర్ న్యాయవాదులకు దన్నుగా నిలవాలని కోరారు. వాస్తవానికి లా నేస్తం పథకానికి నయాపైసా నిధులు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు రావడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు బాలాజీనాయక్, ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణప్ప, జూనియర్ న్యాయవాదులు ఎం.దిలీప్‌కుమార్, పి.లక్ష్మీనారాయణ, జె.శ్రీకాంత్, కె.బాబయ్య పాల్గొన్నారు.
హెడ్‌కానిస్టేబుల్‌పై సైకో దాడి
గుంతకల్లు: స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఉదయం మానసిక స్థితి సరిగా లేని ఓ గుర్తు తెలియని యువకుడు హల్‌చల్ చేశాడు. చేతిలో కర్ర పట్టుకుని పలువురిపై దాడి చేస్తూ భయాందోళనకు గురి చేశాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న టూ టౌన్ హెడ్‌కానిస్టేబుల్ బాబా మున్వర్... సైకో చేష్టను గమనించి అడ్డుకోబోవడంతో మరింతగా రెచ్చిపోయి కర్రతో దాడి చేశాడు. దీంతో హెడ్‌కానిస్టేబుల్ తలకు తీవ్ర రక్తగాయమైంది. గమనించిన స్థానికులు సహనం కోల్పోయి సైకోను చితకబాది ఆస్పత్రికి తరలించారు. గాయపడిన హెడ్‌కానిస్టేబుల్ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
భయభ్రాంతులకు గురి చేసిన సైకో, గాయపడిన హెచ్‌సీ మున్వర్
‘లా నేస్తం’ అమలు చేయాలి
‘లా నేస్తం’ అమలు చేయాలి


