సైబర్ నేరాలు పెరిగాయ్
● 2025 వార్షిక నేర సమీక్షలో ఎస్పీ జగదీష్ వెల్లడి
అనంతపురం సెంట్రల్: జిల్లాలో గతంతో పోలిస్తే 2025 సంవత్సరంలో నేరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. సైబర్ నేరాలు మాత్రం పెరిగాయని ఎస్పీ జగదీష్ తెలిపారు. బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నేరసమీక్ష వివరాలు వెల్లడించారు. 2024 సంవత్సరంలో 8,841 నేరాలు నమోదైతే...2025లో 6,851 నమోదయ్యాయని తెలిపారు. పోలీసుశాఖ తీసుకున్న చర్యల ఫలితంగా నేరాలు కట్టడి చేయగలిగామని చెప్పారు. గత సంవత్సరం 530 దొంగతనాల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 527 కేసులు నమోదయ్యాయన్నారు. హత్యలు 2024లో 57 జరిగితే.. 2025లో 42 నమోదయ్యాయన్నారు. ఎక్కువ శాతం చిన్న చిన్న వివాదాలు, లైంగిక, కుటుంబ ఆస్తి తగాదాలతోనే జరిగాయని పేర్కొన్నారు. ఇక హత్యాయత్నాలు 2024లో 66 కాగా, 2025లో 59 నమోదయ్యాయన్నారు. మహిళలపై జరిగే నేరాలు 733 నుంచి 644కు తగ్గాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద 127 కేసులు నమోదయ్యాయన్నారు. రోడ్డు ప్రమాదాలు 2024లో 544 నమోదు కాగా, 2025లో 496 జరిగాయన్నారు. ప్రధానంగా సైబర్ నేరాలు 32 శాతం పెరిగినట్లు వివరించారు. 2025లో సుమారు రూ.11.25 కోట్ల ఆర్థికనష్టం సంభవించిందని తెలిపారు. 1,218 పేకాట కేసులు, 1,35,572 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు, న్యూసెన్స్ కేసులు 13,779 నమోదయ్యాయన్నారు. డయల్ 100కు 25,611 ఫిర్యాదులు అందాయన్నారు. 2025లో పలు కేసులు ఛేదించడం ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. నూతన సంవత్సరంలో టెక్నాలజీ వినియోగించి నేరాలు ఛేదన, డ్రగ్స్ కట్టడి, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తామని ఎస్పీ వివరించారు. అనంతరం అత్యుత్తమంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.


