ఇలాంటి ప‌రోటాలు తింటే.. మీ ప‌ని అంతే! | parotta unhygienic in sri sathya sai district | Sakshi
Sakshi News home page

Parotta: రెడీమెడ్‌ పరోటాల వాడకం.. ప్ర‌జల ప్రాణాల‌తో చెల‌గాటం

Apr 28 2025 5:43 PM | Updated on Apr 28 2025 6:36 PM

parotta unhygienic in sri sathya sai district

రెండు, మూడు రోజులు నిల్వచేసి వేడి చేసి ఇస్తున్న హోటళ్ల నిర్వాహకులు
నిద్రమత్తులో అధికారులు  

శ్రీ స‌త్య‌సాయి జిల్లా పుట్టపర్తి శివారున శ్రీసత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ మెయిన్‌ గేటు ఎదురుగా నిర్వహిస్తోన్న ఓ హోటల్‌లో రెండు – మూడు రోజుల పాటు నిల్వ ఉంచిన రెడీమేడ్‌ పరోటాలు సరఫరా చేస్తున్నారు. ఇటీవల దుర్వాసన వస్తోన్న పరోటాలను గమనించి.. ఓ వినియోగదారుడు ప్రశ్నించాడు. దీనిపై హోటల్‌ నిర్వాహకులు స్పందించి.. రెండు – మూడు రోజుల పాటు నిల్వ చేసినవి కావడంతో వాసన వస్తోన్నట్లు సమాధానం ఇవ్వడంతో వినియోగదారుడు అవాక్కయాడు. వెంటనే అతను ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  

హిందూపురం (Hindupuram) పట్టణం రైల్వేస్టేషన్‌ సమీపంలోని అండర్‌పాస్‌ వద్ద ఉన్న ఓ చిన్న హోటల్‌లో పరోటా, కుష్కా ప్రసిద్ధి. డిమాండ్‌కు అనుగుణంగా రెడీమేడ్‌ పరోటాలు సరఫరా చేస్తుంటారు. ఒక్కోసారి కస్టమర్లు రాని సమయంలో రెండు, మూడు రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత ఇస్తున్నారు. వారం రోజుల క్రితం ఓ వ్యక్తి పరోట దుర్వాసన వస్తున్నట్లు నిర్వాహకులను నిలదీశారు. వెంటనే రుచి చూసి పక్కన పడేశాడు. సదరు వినియోగదారుడు ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు.

సాక్షి, పుట్టపర్తి: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లు చాలా వరకూ మారిపోయాయి. ఇంటి భోజనం కంటే హోటళ్లు, ధాబాలు, రెస్టారెంట్లు, బేకరీ ఫుడ్‌కు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా హోటల్‌ నిర్వాహకులు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. నిల్వ ఉన్న పదార్థాలు, పలు రసాయనాలతో చేసిన వంటకాలతో ప్రజలను అనారోగ్యం బారిన నెడుతున్నారు. క్యాన్సర్‌ రోగుల్లో 53 శాతం మంది కల్తీ ఆహారంతోనే సమస్య తెచ్చుకున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఇటీవల ఏ హోటల్‌లో చూసినా రెడీమేడ్‌ పరోటాలు కలకలం రేపుతున్నాయి. ఒక రోజు తయారీ చేసి.. మరుసటి  రోజు సరఫరా అయి.. ఆ తర్వాతి రోజు వినియోగదారులకు వడ్డిస్తున్నారు. ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం పట్టణాల్లో ఎక్కువగా రెడీమేడ్‌ పరోటాల (parotta) వ్యాపారం సాగుతోంది.  

శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో చిన్నా, పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, ధాబాలు, చాట్, నూడుల్‌ షాపులు అన్ని కలిపి 5 వేలకు పైగా ఉంటాయి. వీటి ద్వారా ప్రతి ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి హోటళ్లు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంది. కానీ జిల్లాలో ఇలా అనుమతి తీసుకుని వ్యాపారం చేసే సంస్థలు 25 శాతానికి మించి ఉండవనేది బహిరంగ రహస్యం. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా అధిక శాతం హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, రోడ్డుసైడు హోటళ్లలో పరిశుభ్రత గురించి పట్టించుకోవడం లేదు. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉంటారు. నెలకు 12 శాంపిల్స్‌ సేకరించాలి. వాటిని ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత కేసులు నమోదు చేయాల్సి ఉంది. కల్తీని బట్టి క్రిమినల్‌ లేదా సివిల్‌ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించే వీలుంది. కానీ ఇవి సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

చ‌ద‌వండి: వామ్మో.. ఇదేం ట్రాఫిక్ జామ్‌!

తనిఖీలు చేస్తున్నాం  
జిల్లాలో ఏడాదికి 360 శ్యాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలో నెలకు 12 శాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపిస్తున్నాం. కల్తీ తేలిన చోట కేసులు కూడా నమోదు చేస్తున్నాం. ఆహారంలో కల్తీ జరిగిందని తెలిస్తే ఎవరైనా ఫిర్యాదు చేస్తే అక్కడకు వెళ్లి శాంపిల్స్‌ సేకరిస్తున్నాం. ఆహారం కల్తీ జరగకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.  
– రామచంద్ర, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, పుట్టపర్తి  

Advertisement
 
Advertisement
Advertisement