
నగరంలో భారీగా పెరుగుతున్న వాహనాల సంఖ్య
తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగర వాసులు
విజయవాడ నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్య నానాటికీ జటిలమవుతోంది. ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో తూర్పు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా పోలీసులు చేపడుతున్న చర్యలు ఒకింత సత్ఫలితాలనిచ్చినా ప్రయాణికులకు మాత్రం తిప్పలు తప్పటం లేదు.

వాహనం అనివార్యం..
గతంతో పోలిస్తే బెజవాడ నగరంలో వాహనాల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అన్ని వర్గాల ప్రజలు ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్నారు. సమయానికి గమ్య స్థానాలను చేరుకునేందుకు బైక్‌ల వాడకం అనివార్యమైంది. విద్యార్థులు, మహిళలు సైతం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను తమ వ్యక్తిగత ప్రయాణాల కోసం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లపై సైతం రాకపోకలు పెరిగాయి. దీంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య (traffic problem) నానాటికీ పెరిగిపోతోంది.
ప్రధాన కూడళ్ల వద్ద నరకమే..
నగరంలో ప్రధాన రహదారులుగా ఉన్న ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు, ఐదో నంబర్ రోడ్లు వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లు, సిగ్నల్స్ వద్ద ఈ సమస్య మరింత అధికంగా మారింది. ముఖ్యంగా బెంజిసర్కిల్ (Benz Circle) నుంచి రామవరప్పాడు రింగ్ వరకు ఉన్న జాతీయ రహదారి లో ప్రయాణించాలంటే వాహన చోదకులకు సవాలుగా మారింది. సిగ్నల్స్ పడినపుడు వందలాది వాహనాలు బారులుతీరి ప్రయాణికులకు నరకంగా మారుతోంది. ప్రభుత్వాస్పత్రి కూడలి, రమేష్ ఆస్పత్రి రింగ్ రోడ్డు, రామవరప్పాడు (Ramavarapadu) రింగ్ వంటి ప్రధాన కూడళ్ల వద్ద బస్సులు, లారీలు, ఆటోలు బారులు తీరిన పరిస్థితి ఏర్పడుతోంది.

పోలీసుల అవస్థలు..
ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ కోసం పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో సిగ్నల్స్ వద్ద ఇటీవల మైక్‌ల ద్వారా ప్రయాణికులకు సూచనలు ఇస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ముఖ్య అధికారులు, రాజకీయ నాయకుల కాన్వాయ్‌లు వచ్చిపోయే సమయంలో పోలీసులపై మరింత భారం పడుతోంది. దీనికి తోడు తమ గమ్యస్థానాలకు త్వరగా వెళ్లాలనే తొందరలో మితిమీరిన వేగంతో వాహన చోదకులు ప్రయాణించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ప్రయాణికుల సౌకర్యార్థం పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నా కొందరు వీరి కళ్లుగప్పి నిబంధనలు అతిక్రమిస్తున్నారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రయాణికులు తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
చదవండి: నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఎంపీ చిన్నికి కేశినేని నాని వార్నింగ్
పోలీసులు చర్యలు తీసుకోవాలి..
జాతీయ రహదారి వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ప్రతినిత్యం వందలాది వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు, వాహనాల మళ్లింపు విషయంలో పోలీసులు దృష్టి సారించాలి. కేవలం హెల్మెట్‌ల పైనే దృష్టి సారించి ఫైన్లు వేయటానికే పరిమితం కాకుండా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
– జి.రామరాజు, స్థానికుడు, గుణదల