లేపాక్షి: శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం పరిసరాల్లో భిక్షాటన చేసి జీవనం సాగించే వృద్ధ మహిళలను స్థానిక పోలీసుస్టేషన్ వద్ద గంటల తరబడి ఉంచడం చర్చనీయాంశమైంది. భిక్షం అడిగినందుకే తమను పోలీసుస్టేషన్‌కు పిలిపించారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం లేపాక్షి ఆలయ సందర్శనకు హిందూపురం డీఎస్పీ మహేష్ రాగా, ఆయన్ను కొందరు వృద్ధ మహిళలు భిక్షమడిగారు.
ఆయనకు అసౌకర్యం కలిగించారనే కారణంతో వారిని స్థానిక పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్ ప్రాంగణంలో గంటల తరబడి కూర్చోబెట్టారు. తాము పేదరికం కారణంగా భిక్షాటన చేస్తున్నామని, తమను ఇలా స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెట్టడం బాధాకరమని బాధితులు వాపోయారు. ఈ విషయంపై ఎస్‌ఐ నరేంద్రను వివరణ కోరగా.. భిక్షాటన చేసే వారికి ఎవరూ దిక్కులేకుంటే అనాథాశ్రమంలో చేర్పిస్తామని, బంధువులుంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు.


